logo

నల్లమలలో వన్యప్రాణులకు ఆపద

సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది.

Published : 07 May 2024 03:21 IST

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే : సాంకేతికత అభివృద్ధి.. కొన్నింటికి ప్రమాదకరంగా మారాయి. ప్రధానంగా నల్లమల అడవిలో, కృష్ణాతీరంలో వన్యప్రాణులకు, వివిధ రకాల చెట్ల జాతులకు ఆపద వచ్చింది. రాష్ట్రాలకు, అంతర్గత జిల్లాలకు అనుసంధానంగా విద్యుత్తు పవర్‌గ్రిడ్‌లు, మొబైల్‌ సెల్‌ టవర్స్‌, సౌరవిద్యుత్‌ లైన్ల నిర్మాణంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌ నుంచి నల్లమల, కృష్ణాతీర ప్రాంతాల గుండా తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్‌, అచ్చంపేట, వనపర్తి, గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల పరిధి గుండా పవర్‌గ్రిడ్‌, విద్యుత్తు సరఫరా హైటెన్షన్‌ లైన్‌ నిర్మాణం చేశారు. సోమశిల తీరంలో కూడా హైటెన్షన్‌ లైన్‌తో పాటు సౌర విద్యుత్తు లైన్‌ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ నిర్మాణంలో కోల్పోతున్న వివిధ రకాల చెట్ల జాతులను ఈ నెల 4న అచ్చంపేట డీఎఫ్‌వో రోహిత్‌గోపిడి, కొల్లాపూర్‌ రేంజర్‌ శరత్‌చంద్రారెడ్డి పరిశీలించారు.

మల్లేశ్వరం, వేంకల్‌, మంచాలకట్ట తీరంలో హైటెన్షన్‌ విద్యుత్తు లైన్‌తో ఆదివారం ఎర్రకాళ్ల కొంగలు మృత్యువాత పడిన సంఘటనలు కొల్లాపూర్‌ రేంజర్‌ పరిశీలించారు. ఉష్ణోగ్రత తీవ్రత పెరగడం, కృష్ణానదిలో జలాలు అడుగంటడం, సెల్‌ టవర్స్‌, విద్యుత్‌లైన్లతో వన్యప్రాణులకు, చెట్ల జాతులు దెబ్బతింటున్నాయి. ప్రతి వేసవిలో కృష్ణాతీరానికి ఆఫ్రికన్‌, ఆప్ఘనిస్తాన్‌, తదితర ప్రాంతాల నుంచి అతిథి పక్షులు తరలివస్తుంటాయి. ఇందులో వివిధ రకాల కొంగజాతులు, పక్షులు వస్తున్నాయి. చేపలు, పురుగులు ఆహారంగా వీటి జీవనం కొనసాగుతుంది. ఈ ప్రమాదకర పరిస్థితులను చూసిన రేంజర్‌ శరత్‌చంద్రారెడ్డి ఉన్నతాధికారులకు సమస్యను నివేదించారు. ఎర్రకాళ్ల కొంగ కళేబరానికి పంచనామ చేయించడం కూడా జరిగింది. ప్రధానంగా హైటెన్షన్‌ విద్యుత్తు లైన్‌తోనే నల్లమల, కృష్ణాతీరంలో ఆపద పొంచి ఉన్నదని రేంజర్‌ పేర్కొంటున్నారు. సమస్య పరిష్కారం, ప్రత్యామ్నాయం కోసం, వన్యప్రాణులు, చెట్ల జాతులు అంతరించకుండా కాపాడుకోవడం కోసమే ఉన్నతాధికారులకు పూర్తిస్థాయిలో నివేదిక పంపుతున్నామని రేంజర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని