logo

నిలిచిన ఈఎస్‌ఐ వైద్యసేవలు

మహబూబ్‌నగర్‌ పట్టణం ఏనుగొండలోని ఈఎస్‌ఐ(ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌) ఆసుపత్రికి తాళం పడింది. ప్రభుత్వం అద్దె బకాయిలు మంజూరు చేయడం లేదని భవనం యజమాని ఆసుపత్రికి తాళం వేయటంతో వైద్యసేవలు నిలిచిపోయాయి.

Published : 07 May 2024 03:27 IST

అద్దె చెల్లించలేదని ఆసుపత్రి భవనానికి యజమాని తాళం

న్యూస్‌టుడే, పాలమూరు : మహబూబ్‌నగర్‌ పట్టణం ఏనుగొండలోని ఈఎస్‌ఐ(ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌) ఆసుపత్రికి తాళం పడింది. ప్రభుత్వం అద్దె బకాయిలు మంజూరు చేయడం లేదని భవనం యజమాని ఆసుపత్రికి తాళం వేయటంతో వైద్యసేవలు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని ఈఎస్‌ఐ ఖాతా ఉన్న ఉద్యోగులు, కార్మికుల్లో చాలామంది ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలను చేయించుకుంటారు. ఇక్కడ ఓపీ సేవలను అందిస్తున్న వైద్యులు మెరుగైన వైద్యం అవసరమైతే హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈఎస్‌ఐ ఆసుపత్రికి సొంత భవనం లేదు. నెలకు రూ.15వేల అద్దెతో కొన్నేళ్ల నుంచి ఓ ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. 2022 మార్చి నుంచి ఇప్పటి వరకు 24 నెలల అద్దె బకాయిలు రావాల్సి ఉంది. సకాలంలో నిధులు మంజూరు చేయాలని ఆసుపత్రి వైద్యులు ఉత్తరాలు రాసినా, భవనం యజమానికి హైదరాబాద్‌కు వెళ్లి కోరినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. అద్దె డబ్బులు రాకపోవటంతో భవనం యజమాని సోమవారం ఆసుపత్రికి తాళం వేశారు. జడ్చర్ల, బాలానగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రులు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. బాలానగర్‌లో ఆసుపత్రి నిర్వహిస్తున్న ప్రైవేటు భవనానికి కూడా అద్దె డబ్బులు సక్రమంగా రావడం లేదని సమాచారం. జడ్చర్లలోని ఆసుపత్రి రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వెళ్లటంతో ప్రతి నెలా రూ.25వేల అద్దె వస్తోంది. మహబూబ్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రికి సంబంధించిన అద్దె బకాయిలను విడుదల చేయాలని పలుమార్లు తమ రాష్ట్ర శాఖ కార్యాలయానికి నివేదించామని, నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆసుపత్రి వైద్యులు డా.రాఘవేందర్‌ ‘న్యూస్‌టుడే’కు వివరించారు. ఆసుపత్రికి తాళం వేసిన విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు. భవనం యజమాని షాహీన్‌ బేగంను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా రెండేళ్ల నుంచి అద్దె బకాయిలు రాకపోవడంతో తీను తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆసుపత్రికి తాళం వేయాల్సి వచ్చిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని