బెంగళూరులో హుస్నాబాద్ ప్రజా ప్రతినిధులు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ ఫలితం
పోలింగు రోజునే తిరిగి రాక
బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో హుస్నాబాద్ పురపాలిక మహిళా కౌన్సిలర్లు
న్యూస్‌టుడే, హుస్నాబాద్: కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక అనివార్యం కావడంతో శిబిర రాజకీయం షురూ అయింది. ఎవరు ఎవరిని లాక్కుంటారో తెలియని పరిస్థితుల్లో హుస్నాబాద్ నియోజకవర్గంలో తెరాసకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను బెంగళూరుకు తరలించారు. హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉంది. ఇక్కడ పోటీ అనివార్యం కావడంతో తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పురపాలికల కౌన్సిలర్లు చేజారకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా శిబిర రాజకీయాలకు తెరతీశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అందరినీ హుస్నాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి పిలిపించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మార్గ నిర్దేశం అనంతరం శనివారం రాత్రి మూడు బస్సుల్లో హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు పంపించారు. ఉమ్మడి కరీంనగర్ శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. తెరాస తరఫున మాజీ మంత్రి ఎల్.రమణ, ప్రస్తుత ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, తెరాసకు రాజీనామా చేసిన కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్‌తో పాటు మరో 8 మంది పోటీలో ఉన్నారు. ఏకగ్రీవం కావలసిన చోట పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో అధికార తెరాసకు మెజారిటీ ఓటర్లు ఉన్నా అవి చీలకుండా ఉండేందుకు శిబిరం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్, హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో పార్టీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పురపాలికల కౌన్సిలర్లు శిబిరంలో ఉన్నారు. బెంగళూరులోని గోల్డెన్ అమూన్ రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రజా ప్రతినిధులు డిసెంబరు 10న పోలింగు రోజున నేరుగా బస్సుల్లో హుస్నాబాద్‌లోని పోలింగ్ కేంద్రానికి తీసుకు వస్తారని సమాచారం.