logo

ఖర్చు తక్కువ.. మన్నిక ఎక్కువ!

కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన తారురోడ్డు కొన్ని రోజులకే దెబ్బతింటున్నాయి. వర్షపునీరు రోడ్లపై నీరు నిలువ ఉండటం, ఆ నీటిని లోపలికి పీల్చుకునే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు పీఎంజీఎస్‌వై రహదారుల నిర్మాణంలో సరికొత్త టెక్నాలజీ వచ్చింది.

Published : 24 Jun 2022 02:51 IST

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం

 

రోడ్డు నిర్మాణంలో కొబ్బరినార పట్ట ప్రయోగం

కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన తారురోడ్డు కొన్ని రోజులకే దెబ్బతింటున్నాయి. వర్షపునీరు రోడ్లపై నీరు నిలువ ఉండటం, ఆ నీటిని లోపలికి పీల్చుకునే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు పీఎంజీఎస్‌వై రహదారుల నిర్మాణంలో సరికొత్త టెక్నాలజీ వచ్చింది. అదే కొబ్బరినారను ఉపయోగించే పద్ధతి. ఇప్పుడు ఈ విధానాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌) నుంచి నాగారం వెళ్లే రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో జిల్లాలో కొత్తగా ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌) నుంచి నాగారం, అక్కడి నుంచి ఉమ్మాపూర్‌ వెళ్లే రహదారిని తారు రోడ్డుగా మార్చేందుకు ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన కింద రూ.2.31 కోట్లు మంజూరయ్యాయి. 3.6 కి.మీ పొడవైన ఈ రహదారి నిర్మాణ పనులు కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7 చోట్ల కల్వర్టులు నిర్మిస్తున్నారు. 6 చోట్ల సిమెంట్‌ పైపులతో కల్వర్టులు, ఒక చోట స్లాబ్‌తో కూడిన కల్వర్టు నిర్మిస్తున్నారు. కుంట మత్తడి సమీపంలో స్లాబ్‌తో వంతెన నిర్మించాల్సి ఉంది. ఇన్నాళ్లు ఈ రహదారి మొత్తం మట్టిరోడ్డు. ద్విచక్ర వాహనాలు, ఎడ్ల బండ్లు మాత్రమే వెళ్లేవి. దీనిని వెడల్పు చేశారు. మట్టిపోయించి నీళ్లు పడుతూ తొక్కించారు.

జియో టెక్స్‌టైల్స్‌ సాంకేతికతతో..
సాధారణంగా తారు రోడ్ల నిర్మించే సమయంలో ముందుగా మట్టి పోయించి తొక్కిస్తారు. తర్వాత కంకరపొడి (జీఎస్‌బీ)తో కూడిన మిశ్రమం వేసి తొక్కిస్తారు. తర్వాత కంకర వేసి తొక్కించి తారు వేస్తారు. కొత్తగా వచ్చిన కాయర్‌ జియో టెక్స్‌టైల్స్‌ పద్ధతిలో కొబ్బరినారతో తయారు చేసి పట్ట(మెష్‌)ను ఉపయోగిస్తున్నారు. మొరం పోయించి నీరు పడుతూ తొక్కించిన తర్వాత కొబ్బరినారతో తయారు చేసిన మెష్‌ను రోడ్డుపై పరుస్తున్నారు. దానిపై జీఎస్‌బీ మిశ్రమాన్ని వేసి తొక్కిస్తున్నారు. దానిపై కొంచెం పెద్ద కంకర వేసి తొక్కిస్తారు. తర్వాత దానిపై తారు వేస్తారు. పాత పద్ధతి ప్రకారం కింది నుంచి పై వరకు రోడ్డు 14 ఇంచులు ఉండగా కొత్త విధానంలో 11 ఇంచులు మాత్రమే ఉంటుందని డీఈ తెలిపారు.

జిల్లాలో ఇదే ప్రథమం..
జిల్లాలో మొదటిసారిగా ఈ పద్ధతిలో రోడ్డు వేస్తున్నాం. నిర్మాణంలో ఉపయోగించిన కొబ్బరినార మట్టిలో కలిసిపోతుంది. వర్షం పడినపుడు రోడ్డుపై ఉన్న నీటిని ఆ నార లోపలికి పీల్చుకుని వెంటనే బయటకు పంపుతుంది. లేదంటే లోపలికి ఇంకేలా చేస్తుంది.దీంతో ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.   

 - సదాశివరెడ్డి, డీఈ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని