logo

యువకుడిపై కర్రలతో దాడి... తీవ్ర గాయాలు

పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఓ యువకుడిపై కర్రలతో దాడి చేయడంతోపాటు కులం పేరుతో దూషించిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చీలేమామిడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఝరాసంగం ఎస్సై రాజేందర్‌రెడ్డి తెలిపిన

Published : 05 Jul 2022 01:48 IST

నరేష్‌ను కొడుతున్న శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు

ఝరాసంగం: పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఓ యువకుడిపై కర్రలతో దాడి చేయడంతోపాటు కులం పేరుతో దూషించిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చీలేమామిడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఝరాసంగం ఎస్సై రాజేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... చీలేమామిడి గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ నరేశ్‌కు అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ గొల్ల శ్రీనివాస్‌కు పాత తగాదాలు ఉన్నాయి. శ్రీనివాస్‌ ఇంట్లో లేనప్పుడు నరేష్‌ తరచుగా ఆయన ఇంటికి వస్తుండేవాడు. ఇంటికి రావొద్దని గతంలో రెండుసార్లు హెచ్చరించినా నరేష్‌ వినిపించుకోలేదు. సోమవారం ఉదయం శ్రీనివాస్‌ ఇంట్లో లేనప్పుడు నరేష్‌ రాగా... కుటుంబ సభ్యులు గుర్తించి ఆయనపై కర్రలతో దాడి చేశారు. నరేశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు జహీరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని దాడి చేయడంతోపాటు కులం పేరుతో దూషించారని నరేశ్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్ల శ్రీనివాస్‌, రవి, గోపాల్‌, శేఖర్‌, రాములు, మంగమ్మ, రమేశ్‌, నరసింహులు, జనాబాయి, సంగన్నలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. కాగా... వివాహేతర సంబంధమే గొడవకు దారి తీసినట్లు గ్రామస్థులు చెప్పుకొంటున్నారు.

సంఘాల నేతల పరామర్శ

జహీరాబాద్‌ అర్బన్‌: ఝరాసంగం మండలం చీలేమామిడిలో దళిత యువకుడిపై మూకుమ్ముడిగా దాడి చేయడం అమానుషమని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మానిటరింగ్‌ కమిటీ, భీమ్‌ ఆర్మీ, కేవీపీఎస్‌, సమతా సైనిక్‌ దళ్‌, ప్రజాసంఘాల నాయకులు సోమవారం ఆరోపించారు. గాయపడి జహీరాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్‌ను పరామర్శించిన సందర్భంగా వారు మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితుడి తండ్రితో ఝరాసంగం ఎస్‌ఐకి ఫిర్యాదు చేయించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు బంటు రామకృష్ణ, భీమ్‌ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధూ రావణ్‌, కేవీపీఎస్‌ నాయకుడు మహేష్‌, సమతా సైనిక్‌దళ్‌ నాయకుడు రాములు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని