logo

ఆశల చిగురింత

గొల్లకుర్మ, యాదవులకు  గొర్రెల పెంపకంతో శాశ్వత ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. జీవాల పెంపకందారుల పాలిట ఈ పథకం వరంలా మారింది.

Published : 21 Mar 2023 02:32 IST

వచ్చే నెల గొర్రెల పంపిణీకి కసరత్తు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: గొల్లకుర్మ, యాదవులకు  గొర్రెల పెంపకంతో శాశ్వత ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది. జీవాల పెంపకందారుల పాలిట ఈ పథకం వరంలా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొంత కాలంగా నిధుల లేమితో యూనిట్ల గ్రౌండింగ్‌ ప్రక్రియ ముందుకుసాగని పరిస్థితి. ఏప్రిల్‌ నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.  

లక్ష్యం 30,896 యూనిట్లు

జిల్లాలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న 30,896 మందికి జీవాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఐదేళ్ల కిందట గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపికచేశారు. 2017-18 నుంచి పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. నిధుల లేమితో పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు 19,178 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్‌ చేశారు.

వాటాధనం చెల్లించిన వారికి ప్రాధాన్యం

ప్రభుత్వ మార్గదర్శకాలు అందగానే ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్న గొర్రెల పంపిణీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వాటాధనం చెల్లించి నిరీక్షిస్తున్న లబ్ధిదారులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటాయి. యూనిట్‌ విలువ గతంలో రూ.1.25 లక్షలు ఉండగా ఇప్పుడు రూ.1.75లక్షలకు పెంచారు. 75శాతం అంటే రూ.1,31,250 రాయితీ కింద ప్రభుత్వం అందిస్తుంది. లబ్ధిదారు వాటా ధనం రూ.43,750 చొప్పున 700 మంది రూ.3.06కోట్లు చెల్లించారు. వీరందరికీ యూనిట్లు కేటాయించనున్నారు. నిధులు విడుదల కాగానే పంపిణీ చేయనున్నట్టు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారిణి వసంతకుమారి తెలిపారు.

గొల్లకుర్మ, యాదవుల జనాభా: 48,814
కుటుంబాలు: 11,210
గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు: 503
వాటిలో సభ్యులు: 30,896

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని