logo

యాసంగి కొనుగోళ్లకు సన్నద్ధం

యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత సీజన్‌తో పోల్చితే ఈసారి గణనీయంగా సాగు పెరిగింది. దీంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 30 Mar 2023 02:49 IST

2.30 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా
209 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక

కల్హేర్‌ మండలం బీబీపేటలో వరి చేను

ఈనాడు, సంగారెడ్డి: యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత సీజన్‌తో పోల్చితే ఈసారి గణనీయంగా సాగు పెరిగింది. దీంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత యాసంగిలో 75వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. ఈసారి ఏకంగా 2.07 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు మూడింతల మేర అదనంగా కొనాల్సి వస్తుండటంతో 209 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గత వానాకాలం మాదిరిగానే ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వరి సాగు చేసిన ప్రతి గ్రామంలోనూ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు సుగుణాబాయి తెలిపారు. ఏప్రిల్‌ నుంచి కేంద్రాలకు ధాన్యం రావడం ఆరంభం అవుతుందంటున్నారు. అందుకు తగినట్లుగా సిద్ధమవుతున్నారు. మే నెలలో ఒక్కసారిగా ధాన్యం భారీగా కేంద్రాలకు రానుంది. ఆ సమయంలోనూ సమస్యలు ఉత్పన్నమవకుండా చూస్తే మేలు.

కొరత రాకుండా చూడాలి

ప్రధానంగా ప్రతిసారీ రవాణా సమస్య వస్తుంటుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రోజుల పాటు కేంద్రాల్లోనే ఉంటుంది. మిల్లుకు తరలించే వరకు రైతుదే బాధ్యత అని నిర్వాహకులు చెబుతుంటారు. దీంతో అన్నదాతలు కేంద్రాల వద్దే పడిగాపులు పడాల్సిన పరిస్థితి. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతే వారే నష్టపోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈసారి లారీల కొరత తలెత్తకుండా చూడాలి. గన్నీ సంచులు, ధాన్యం శుభ్ర పరిచేవి, తేమ కొలిచేవి, తూకం యంత్రాలు... ఇలా అవసరమైన అన్నింటినీ కొనుగోళ్లు మొదలయ్యేలోగా కేంద్రాల్లో అందుబాటులో ఉంచితే సమస్యలు రావు.

ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో..

ఈసారి వేసవిలో భానుడు ప్రతాపం చూపుతాడనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో కేంద్రాల వద్ద కనీస వసతులు ఏర్పాటు చేస్తే మేలు. తాగునీరు, ఓఆర్‌ఎస్‌ పొట్లాలు అందుబాటులో ఉంచాలి. రైతులు, హమాలీలు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా నీడ ఉండేలా చూస్తే వడదెబ్బ బారిన పడకుండా వారిని కాపాడుకోవచ్చు. దాతలు స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద మజ్జిగ, అంబలి లాంటి వాటిని అందిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అధికారులు ఈ దిశగానూ వారిని ప్రోత్సహిస్తే మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని