logo

సాధారణ జీవితం.. బస్సులో ప్రయాణం

ప్రస్తుతం ఎన్నికలంటే చాలు రూ.కోట్లు వెచ్చించాల్సిందే. అప్పుడే ఫలితం దక్కుతుందన్నది నేటి తరం భావన. కానీ ఒకప్పుడు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు చేసింది కేవలం రూ.30 వేలంటే అందరూ ఆశ్చర్యపోతారు

Updated : 28 Oct 2023 04:36 IST

ఆర్‌ఎస్‌ వాసురెడ్డి

ప్రస్తుతం ఎన్నికలంటే చాలు రూ.కోట్లు వెచ్చించాల్సిందే. అప్పుడే ఫలితం దక్కుతుందన్నది నేటి తరం భావన. కానీ ఒకప్పుడు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు చేసింది కేవలం రూ.30 వేలంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఇది మాత్రం అక్షర సత్యం. ఎమ్మెల్యేగా పని చేసినా చనిపోయే వరకు సాధారణ జీవితమే గడిపారు. ఆయనే మెదక్‌ జిల్లా రామాయంపేట ఎమ్మెల్యేగా పని చేసిన రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి (ఆర్‌ఎస్‌ వాసురెడ్డి).

వాసురెడ్డి 1985లో రామాయంపేట నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ఆయన ఖర్చు చేసింది కేవలం రూ.30 వేలే. నాడు ప్రచారం కూడా సాదాసీదాగా సాగింది. కార్యకర్తలు సైకిళ్లపై వెళ్లి ప్రచారం చేశారు. ప్రత్యర్థి ఎక్కువ డబ్బు ఖర్చు చేసినా ప్రజలు ఆదరించింది వాసురెడ్డినే కావడం గమనార్హం. 1983లోనూ ఇదే నియోజకవర్గం నుంచి  పోటీ చేయగా ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ప్రజల మధ్యనే ఉండేవారు. శాసనసభ సమావేశాలకు బస్సులోనే వెళ్లేవారు. చనిపోయే వరకు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సే ఎక్కేవారు.  అభివృద్ధి విషయంలో ఏనాడు రాజీ పడలేదన్న పేరు సంపాదించుకున్నారు. గత నెలలో అనారోగ్యంతో చేగుంట మండలం పొలంపల్లిలోని ఆయన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. నేడు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆదర్శ ప్రాయుడు.

న్యూస్‌టుడే, చేగుంట


పీవీ నర్సింహరావు

 వంగరవాసి

ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చిన పీవీ నర్సింహరావు అంటే తెలియని వారుండరు. ఆయనది హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని వంగర గ్రామం. ప్రస్తుతం ఈ గ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఉంది. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధానమంత్రి పదవులను అలంకరించారు. 1957లో తొలిసారిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మంథని నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1962లో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పదవి చేపట్టారు. 1971లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. హనుమకొండ, రాంటెక్‌, నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో విదేశీ వ్యవహారాలు, రక్షణ, మావన వనరుల అభివృద్ధి శాఖలు చేపట్టారు 1991-96 వరకు పీవీ ప్రధానిగా బాధ్యతలను సమర్థంగా నిర్వహించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. పీవీ కుమారుడు రంగారావు విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. మరోకుమారుడు పీవీ రాజేశ్వర్‌రావు ఓసారి ఎంపీగా ఎన్నికయ్యారు. పీవీ కుమార్తె సురభి వాణిదేవి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని