logo

స్పందించండి.. సంధించండి

ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా..  ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది.

Updated : 28 Mar 2024 04:44 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, మెదక్‌, వికారాబాద్‌ కలెక్టరేట్‌, సిద్దిపేట

ప్రజలు రాకపోకలు సాగించేటపుడు దారిలో అనేక సంఘటనలు చూస్తుంటారు. కొన్ని హృదయవిదారకంగా, ఎలాగైనా సాయం చేయాలనిపించేలా.. ఇంకొన్ని అన్యాయంగా, అక్రమంగా.. అగుపిస్తాయి. బిజీ జీవితమైనా ఉత్తమ పౌరులుగా స్పందించాలనిపిస్తుంది. ఫోన్‌ చేసి ఎవరికైనా సమాచారం ఇవ్వాలనిపిస్తుంది. సంబంధిత ఫోన్‌ నంబరు గుర్తుకురాక ఇప్పుడెలా అని సతమతం అవుతుంటారు. అలాంటి వాటికి ప్రభుత్వం, సంస్థలు టోల్‌ఫ్రీ ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచారు. వాటిని నమోదు చేసుకొని అవసరమైనపుడు ఫోన్‌ చేసి సంధించొచ్చు. ఆయా ఫోన్‌ నంబర్లను తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం.


సైబర్‌ నేరాల అడ్డుకట్టకు..

1930

యువతకు సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన

సైబర్‌ నేరాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. నిరక్షరాస్యలే కాకుండా ఉన్నతాద్యోగులు సైతం బాధితులే ఉండటం గమనార్హం. ఆన్‌లైన్‌లో యాప్‌ల ద్వారా ఉద్యోగాలు, అధికంగా నగదు అందిస్తాం అంటూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేసి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌లు చేసి మోసానికి గురి చేస్తున్నారు. అలాంటి వాటికి త్వరగా ఆన్‌లైన్‌లో https:///www.cybercrime.gov.in సమాచారం ఇచ్చిన వెంటనే వారు నగదును నిందితుడి ఖాతాకు వెళ్లకుండా నిలిపివేస్తారు. జాతీయ టోల్‌ఫ్రీ నంబరు 1930 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.


వేధింపులకు గురవుతున్నారా

181

నిత్యం భర్త మద్యం తాగి వచ్చి భార్యతో తగాదా పెట్టుకుంటున్నారా? వరకట్నం తేవాలని వేధిస్తున్నారా? బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా ఆకతాయిలు సతాయిస్తున్నారా? వెంటనే మహిళ హెల్ప్‌లైన్‌ 181 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇస్తే చాలు. క్షణాల్లో అక్కడికి సఖి కేంద్రానికి సంబంధించిన వాహనం వస్తుంది. మహిళకు ఉచితంగా వైద్యం, న్యాయం, పోలీసు, వసతి, సౌకర్యాలు కల్పిస్తుంది. ఇటీవల ‘టీసేఫ్‌’ యాప్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. యాప్‌లో ప్రయాణిస్తున్న ప్రాంతం వివరాలు నమోదు చేస్తే పోలీసు రక్షణ వ్యవస్థలోకి వెళ్తాయి.


మూగ జీవాల రక్షణ

మూగ జంతువులు బావిలో పడటం.. చెట్లలో ఇరుక్కుపోవడం, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి  అవస్థ పడుతుంటాయి. అలాంటి ఇబ్బందికర పరిస్థితిలో జంతువులను రక్షించేందుకు అటవీ రేంజ్‌ అధికారులకు ఫోన్‌ చేస్తే స్పందిస్తారు.

సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ రేంజీ అధికారి వీరేంద్రబాబు 94401 11126... మెదక్‌ జిల్లా అధికారి రవిప్రసాద్‌ 94903 57522.. సిద్దిపేటలో .. సందీప్‌కుమార్‌ - 99595 30053.. వికారాబాద్‌లో ... జ్ఞానేశ్వర్‌ 89789 71100కు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది.


వయో వృద్ధులకు అండ

14567

వయసు పైబడిన వెంటనే తల్లిదండ్రులను సరిగా పట్టించుకోవటం లేదు. ఆస్తి పంపకాలు, కుటుంబ కలహాలు, ఇతరత్రా గొడవలు ఉంటున్నాయి. ఎవరైనా 14567కు ఫిర్యాదు చేస్తే చాలు.. అధికారులు స్పందించి కుటుంబీకులకు కౌన్సిలింగ్‌ ఇస్తారు. అవసరమైతే ఇతరత్రా సాయం చేస్తారు. ఆర్‌డీవో ఆధ్వర్యంలో విచారణ చేపడతారు.


ఆహార కల్తీకి చెక్‌

ఇష్టంగా కొనుకున్న ఆహారం నాసిగా ఉన్నా.. హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నా.. పండ్లను హానికారకమైన కార్బైడ్‌తో మగ్గిస్తున్నా.. చెక్‌ పెట్టవచ్చు. వీటి నియంత్రణకు అధికారికి ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారు.

సంగారెడ్డిలో ఆహార కల్తీ నియంత్రణ పర్యవేక్షణ అధికారి ధర్రేంద 9848411174..
మెదక్‌లో .. తార్యానాయక్‌ 9676974565.. సిద్దిపేటలో.. అనూష - 93470 44004.


తూకాల్లో మోసాలు

తూకాల్లో కనికట్టు చేసినా.. పెట్రోలు తక్కువ వస్తోందని అనుమానం వచ్చినా.. చూస్తూ ఊరుకోవద్దు. తూనికలు కొలతల శాఖను సంప్రదించండి.

సంగారెడ్డి జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి
అనిల్‌కుమార్‌ 85230 11449..  మెదక్‌లో .. సుధాకర్‌ 99664 41128..
సిద్దిపేటలో.. శ్రీనివాస్‌రెడ్డి  98489 23848..  
వికారాబాద్‌లో ... అశోక్‌కుమార్‌ 90003 14247


బాల్యవివాహాలను నిలువరించండిలా..

1098

బాల్య వివాహాలు అరికట్టేందుకు సూచనలిస్తున్న అధికారులు

ఎవరైనా బాలబాలికలకు పెళ్లి చేస్తే 1098కు సమాచారం ఇవ్వాలి. బాలల పరిరక్షణ అధికారి, పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇస్తారు. పెళ్లి పూర్తయితే ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. బడికి వెళ్లాల్సిన వయసులో ఇటుక బట్టీల్లో, హోటళ్లు, దుకాణాల్లో చట్ట విరుద్ధంగా పని చేయించుకుంటే ఫోన్‌ చేయాలి. కార్మిక శాఖ, బాలల పరిరక్షణ అధికారులు చర్యలు తీసుకుంటారు.


గ్యాస్‌తో జాగ్రత్త!

1906
18002333555

వంటకు గ్యాస్‌ ఎంతటి ప్రయోజనకరమో.. నిర్లక్ష్యంగా ఉంటే అంత ప్రమాదకరం. సిలిండర్‌ లీకేజీని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే లీకేజీ లేదా ఇతరత్రా సిలిండర్‌ సమస్యలకు టోల్‌ఫ్రీ నంబరుకు చేస్తే.. పరిష్కారం దొరుకుతుంది. హెచ్‌పీ, భారత్‌, ఇండేన్‌ తదితర గ్యాస్‌ కంపెనీలకు ప్రత్యేకంగా వేర్వేరు ఫోన్‌ నంబర్లు ఉన్నా.. టోల్‌ఫ్రీ ద్వారా ఏ కంపెనీదైనా ఫిర్యాదు, సూచనలు, ప్రతిపాదనలు చేయవచ్చు. గ్యాస్‌ లీకేజీలకు మాత్రమే ప్రత్యేకంగా 1906 నంబరు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని