logo

ఒక్క ప్రమాదం.. నాలుగిళ్లలో విషాదం

ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది.

Updated : 29 Mar 2024 04:54 IST

బోసిపోయిన పెళ్లి ఇల్లు

న్యూస్‌టుడే, పాపన్నపేట: ఒక్క రోడ్డు ప్రమాదం.. నాలుగిళ్లలో తీరని విషాదాన్ని నింపింది. ఓ వైపు పెళ్లి బాజాలు, మరోవైపు బంధువులు, మిత్రుల సంతోషం, ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఆ పెళ్లి ఇల్లు శోకసంద్రంలో మునిగిపోయింది. పచ్చని పందిరి సిద్ధం చేస్తుండగా.. విధి వక్రీకరించింది. బుధవారం పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు 30 మంది బంధువులు ట్రాక్టర్‌పై వెళ్తుండగా బోల్తాపడటంతో ముగ్గురు మహిళలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన మరువకముందే గురువారం వరుడి తాత మనోవేదనతో ఆత్మహత్య చేసుకోవడం మరింత కలిచివేసింది.

వరుడి ఇంటి వద్దే..: పాపన్నపేట మండలం బాచారానికి చెందిన సొంగ గౌరగారి పెంటయ్య (68), పాపమ్మ దంపతులకు ఏకైక కుమార్తె శ్యామమ్మ ఉన్నారు. కుమారులు లేకపోవడంతో శ్యామమ్మను ఇదే గ్రామానికి చెందిన పోచయ్యతో వివాహం చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రమేష్‌, కృష్ణ ఉన్నారు. పెద్ద కుమారుడు రమేష్‌కు ఇటీవల అందోలుకు చెందిన మమతతో వివాహం నిశ్చయమైంది. వరుడి ఇంటి వద్ద గురువారం జరగాల్సిన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లికుమార్తెను తీసుకొచ్చేందుకు వరుడి సమీప బంధువులు 30 మంది ట్రాక్టర్‌లో అందోలుకు బయల్దేరారు. మన్‌సానిపల్లి మలుపు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
భర్తకు అండగా..: ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో మృతిచెందిన వారందరికీ వ్యవసాయమే ఆధారం. ఈ ఘటనలో మృతి చెందిన జట్టిగారి సంగమ్మ (47), గోపాల్‌ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సాయికుమార్‌ ఉన్నారు. కుమార్తెలందరికీ వివాహాలు జరిగాయి. సాయికుమార్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. గోపాల్‌ ఇటీవల పక్షవాతం బారినపడ్డాడు. సంగమ్మ ఓ వైపు వ్యవసాయం చేస్తూ, మరోవైపు భర్త ఆలనాపాలన చూసుకుంటోంది. ప్రమాదంలో సంగమ్మ మృతి చెందడంతో తనకెవరు దిక్కని గోపాల్‌ రోదన అందరినీ కంటతడిపెట్టించింది.

అందరివీ వ్యవసాయ కుటుంబాలే..

  • ఈ ఘటనలో మృతి చెందిన రావుగారి భూదమ్మ (50).. భర్త కిష్టయ్య పదేళ్ల కిందట మృతి చెందాడు. కుమారుడు లక్ష్మీనారాయణ, కుమార్తె ఉన్నారు. భర్త చనిపోయాక కుటుంబ భారమంతా భూదమ్మపైనే పడింది. వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ అందరినీ పెంచి పెద్ద చేసింది. అందరికీ వివాహాలు జరిగాయి.
  • మరో మృతురాలు రావుగారి ఆగమ్మ (50)కు భర్త మల్లయ్య, కుమార్తె మహేశ్వరి ఉన్నారు. వీరికి వ్యవసాయమే ఆధారం. కుమారులు లేకపోవడంతో కుమార్తెకు వివాహం చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నారు.

ఉలిక్కిపడిన బాచారం: గ్రామస్థులంతా పెళ్లికి సిద్ధమవుతుండగా, ఇంతలో ట్రాక్టరు బోల్తా పడిన విషయం తెలియడంతో అందరూ హతాశులయ్యారు. మృతులందరూ సమీప బంధువులు కావడంతో ఆనందం కాస్త ఆవిరైంది. దీనికితోడు వృద్ధుడి ఆత్మహత్య మరింత కలచివేసింది. గత ఫిబ్రవరి 19న ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే మరో నలుగురు మృతి చెందడంతో బాచారం గ్రామం ఉలిక్కిపడింది. బాధిత కుటుంబాలను మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువారం సాయంత్రం పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. నరేందర్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, గణేష్‌, తదితరులున్నారు.


మనోవేదనతో తాత..

పెంటయ్య

బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోగా, తన మనవడి పెళ్లి ఆగిపోయిందని రమేష్‌ తాత పెంటయ్య మనోవేదనకు గురయ్యాడు. గురువారం తెల్లవారుజామున ఇంట్లోని ఓ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ వైపు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, వృద్ధుడి బలవన్మరణంతో బంధువులు, గ్రామస్థుల రోదనలు మిన్నంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని