logo

ఎన్నికలకు సమాయత్తం

బరిలో నిలిచే అభ్యర్థులు తేలిపోవడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎంలు ఆయా జిల్లాలకు చేరుకోగా, అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు.

Updated : 05 May 2024 06:32 IST

ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి
సెగ్మెంట్ల వారీగా కేటాయింపు

మెదక్‌లో ఈవీఎం ఎఫ్‌ఎల్‌సీని పరిశీలిస్తున్న రిటర్నింగ్‌ అధికారి రాహుల్‌రాజ్‌

న్యూస్‌టుడే-మెదక్‌: బరిలో నిలిచే అభ్యర్థులు తేలిపోవడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈవీఎంలు ఆయా జిల్లాలకు చేరుకోగా, అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ చేస్తుండటంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు. వాటికి రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి సెగ్మెంట్ల వారీగా కేటాయించారు. మరోవైపు ఎన్నికల సిబ్బందికి శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం...

 అభ్యర్థులు పెరగడంతో..

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థానం నుంచి 44 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇది వరకు అధికారులు కొన్ని ఈవీఎంలను తెప్పించారు. వాటికి సంబంధించి మొదటి విడత పరిశీలన, ర్యాండమైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అదనంగా మరిన్ని ఈవీఎంలను తెప్పించారు. ఈ ఎన్నికల్లో ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి మూడు బ్యాలెట్‌, ఒక కంట్రోల్‌ యూనిట్‌, ఒక వీవీప్యాట్‌ అవసరం. పోలింగ్‌ రోజున ఎటువంటి సాంకేతిక సమస్య తలెత్తకుండా 25 శాతం బ్యాలెట్‌ యూనిట్లు, 25 శాతం కంట్రోల్‌ యూనిట్లు, 40 శాతం వీవీప్యాట్‌లను అందుబాటులో ఉంచారు.

సిబ్బందికి శిక్షణ...:

ఆయా సెగ్మెంట్లలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రెండో విడత శిక్షణ నిర్వహిస్తున్నారు. మొదటి విడత కొద్దిరోజుల కిందట పూర్తికాగా, ప్రస్తుతం శిక్షణ కొనసాగుతున్న సెగ్మెంట్‌ పరిధిలో సిబ్బందికి డ్యూటీ వేయనున్నారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో వారికి బ్యాలెట్‌ యూనిట్‌పై అవగాహన కల్పిస్తున్నారు. పీవో, ఏపీవోలకు శిక్షణ కొనసాగగా, త్వరలో ఇతర పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.


సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో..

ఈనెల 13న జరిగే పోలింగ్‌ నేపథ్యంలో నాలుగు నెలల ముందు నుంచే ఎన్నికల సంఘం ఈవీఎంల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి ఎఫ్‌ఎల్‌సీ(ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌) ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో ఈవీఎంల తయారీ సంస్థల ఇంజినీర్లు, నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా ఎన్నికల అధికారి పాల్గొన్నారు. జిల్లాలకు కేటాయించిన ఈవీఎంలు సరిగా పని చేస్తున్నాయా? లేదా? అనేది పరిశీలించారు. సరిగా పనిచేస్తున్న వాటిని మొదటి విడత ర్యాండమైజేషన్‌ పూర్తి చేసి ఆయా జిల్లాలోని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. మొదటి విడత ర్యాండమైజేషన్‌ ఆయా జిల్లాల ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో జరగగా, రెండో విడత ర్యాండమైజేషన్‌ శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎన్నికల పర్యవేక్షకులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. ఈ మేరకు ఆయా సెగ్మెంట్లలో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఈవీఎంల జాబితాను సంబంధింత ఏఆర్వోలకు పంపారు. ప్రస్తుతం ఆయా సెగ్మెంట్లలోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపర్చిన ఈవీఎంల కమిషనింగ్‌ కొనసాగుతోంది. బరిలో 44 మంది అభ్యర్థులు ఉండడంతో ఇటీవల బ్యాలెట్‌ పేపర్‌ను ముద్రించారు. ఈ పేపర్‌ను బ్యాలెట్‌ యూనిట్లలో పొందుపరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని