logo

ఉపాధి ప్రశ్నార్థకం.. జీవనం భారం!

రేయింబవళ్లు చెమటోడ్చి.. బీడీలు చుట్టే కార్మికుల కష్టం అంతాఇంతా కాదు. ఆరోగ్యాన్ని లెక్కచేయక.. కుటుంబ పోషణ భారం మోసే మహిళలు అనేకం. కొన్నేళ్లుగా ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరవవుతోంది.

Updated : 07 May 2024 06:05 IST

బీడీ కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి అవశ్యం
న్యూస్‌టుడే, సిద్దిపేట, చేగుంట, రామాయంపేట

రేయింబవళ్లు చెమటోడ్చి.. బీడీలు చుట్టే కార్మికుల కష్టం అంతాఇంతా కాదు. ఆరోగ్యాన్ని లెక్కచేయక.. కుటుంబ పోషణ భారం మోసే మహిళలు అనేకం. కొన్నేళ్లుగా ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరవవుతోంది. దీన్నే జీవనాధారంగా మార్చుకున్న ఎంతో మంది ప్రత్యామ్నాయం లేక ఆపసోపాలు పడుతున్నారు. ఏళ్లుగా ఎన్నో వెతలు అనుభవిస్తున్న కార్మికులు.. బతుకు బండి లాగేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల వేళ బరిలో నిలిచిన నేతలు.. తమ కష్టాలు తీర్చి గట్టెక్కిస్తామనే నమ్మకం కలిగించే వారికి జై కొడతామని చెబుతున్నారు సిద్దిపేట, మెదక్‌ జిల్లాల కార్మికులు. ఎన్నికల సంగ్రామంలో విజేతగా నిలిచే నేత.. వారిపై దృష్టిసారించి ప్రణాళికతో అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది.
ఆకు(తునికి)ను ఓ నమూనాలో కత్తిరించి.. పొడి తంబాకు (పొగాకు) వేసి.. ఓపిగ్గా చుట్టి.. దారం కడితే ఒక బీడీ తయారవుతుంది. ఇలా చెమటోడ్చి శ్రమించే ఎంతో మంది కార్మికులు చేతినిండా పని లేక ఆపసోపాలు పడుతున్నారు. వచ్చే సొమ్ము గిట్టుబాటవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ఈ పరిశ్రమ విస్తరించింది. రెండు జిల్లాల్లో అనేక గడపలకు విస్తరించిన ఈ కుటీర పరిశ్రమ.. ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. బీడీ కార్మికులకు పోషణ భారంగా మారింది. పనిదినాలు తగ్గి ప్రత్యామ్నాయం లేక ఉసూరుమంటున్నారు. మరోవైపు సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పనిదినాలు కుదించడంతో..

నాలుగేళ్లుగా జీఎస్టీ కారణంగా కంపెనీలకు నిర్వహణ భారం కాగా.. నెలకు 10 నుంచి 15 రోజులు మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. పనిదినాలు కుదించడంతో దానిపై ఆధారపడి జీవించే వారు ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు రోజంతా కష్టపడ్డా 500 బీడీలు చుట్టలేని పరిస్థితి కార్మికులకు ఎదురవుతోంది. ప్రత్యామ్నాయం కరవై.. బతుకుబండి లాగడం కష్టమవుతోంది. ఇరు జిల్లాలో 81 వేల మంది కార్మికులు ఉంటారు. మొత్తం ఐదు రకాల కంపెనీలు (ప్రధానమైనవి) విస్తరించాయి. నిత్యం 1.50 కోట్ల మేర బీడీలు ఉత్పత్తి అవుతున్నాయి. దుబ్బాక, సిద్దిపేట, రామాయంపేట, చేగుంటలో అత్యధికంగా కార్మికులు ఉన్నారు. వేయి బీడీలకు రూ.245.8 కూలీగా నిర్వాహకులు చెల్లిస్తున్నారు. మరోవైపు సంక్షేమ మండలికి సొమ్ము చేరక కొన్ని పథకాల అమలులో జాప్యం ఏర్పడుతోందని కార్మికులు వాపోతున్నారు. జీఎస్టీ చెల్లించని కొన్ని కంపెనీలు.. కార్మికులకు భవిష్యనిధి, ఈఎస్‌ఐ, కనీస వేతనం అమలు చేయడం లేదు.


సమస్యలు పరిష్కరిస్తే మేలు..

  • గతంలో పదేళ్లు పని చేస్తే 50 ఏళ్లు నిండిన తర్వాత పింఛను అమలయ్యేది. ప్రస్తుతం 3,365 రోజులు పని చేస్తే పింఛను దక్కేలా సంబంధిత జీవో సవరణ చేశారు. పాత పద్ధతితోనే మేలు.
  • బీడీ రంగంపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) గుదిబండగా మారింది. తక్షణమే మినహాయింపు ఇవ్వాలి.
  • కార్మికులకు పింఛను రూ.వేయి వరకు వస్తోంది. ప్రతి నెలా రూ.5 వేల పింఛను అమలు చేయాలనే డిమాండ్‌ ఉంది.
  • కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం రూ.2016 నుంచి రూ.4 వేలకు జీవనభృతిని పెంచుతామనే హామీని నెరవేర్చాలి.
  • ఈఎస్‌ఐ వర్తింపజేయాలి. మెరుగైన వైద్యానికి జిల్లా కేంద్రాల్లో వంద పడకల ఆసుపత్రి నిర్మించాలి. కుటుంబానికి ప్రత్యేక ఆరోగ్య బీమా కల్పించాలి.
  • కంపెనీలు నాసిరకం ముడిసరకు సరఫరా చేస్తోంది. నాణ్యంగా అందించాలి.
  • నెలలో కనీసం 24 రోజులు పనిదినాలు కల్పించాలి.
  • వేయి బీడీలకు కూలీగా రూ.500 పెంచాలి. నెలకు దాదాపు రూ.10 వేలు గిట్టుబాటు కావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని