logo

నవోన్మేశమే.. ‘యువా’శయం

ఎన్నికలు ఏవైనా.. యువ భాగస్వామ్యం కీలకం. వారు తీసుకునే నిర్ణయం సమాజ ప్రగతికి దోహదపడుతుంది.

Updated : 09 May 2024 05:55 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి టౌన్‌, వికారాబాద్‌

న్నికలు ఏవైనా.. యువ భాగస్వామ్యం కీలకం. వారు తీసుకునే నిర్ణయం సమాజ ప్రగతికి దోహదపడుతుంది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో మెజార్టీ ఓటర్లుగా యువతీ, యువకులు ఉన్నారు. ఈ తరుణంలో వారి భవితకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎన్నికయ్యే నేతపై ఉంటుంది. యువ ఆకాంక్షలను అద్దం పట్టే పాలన అందించాల్సిన ఆవశ్యకత ఉంది. చదువు, ఉద్యోగం, ఉపాధి, నైపుణ్య శిక్షణ, ఇతరత్రా రంగాల్లో తమదైన ప్రత్యేకతను చాటేందుకు యువత ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలో వారి ఆశయాలకు నెరవేర్చేందుకు సంపూర్ణ సహకారం అందించాలని ఆకాంక్షిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ యువత ఆశలు, ఆశయాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

చదువుతోనే ప్రగతి..

చదువుతోనే సమాజ ప్రగతి సాకారమవుతుంది. అందుకు సమగ్ర ప్రణాళిక అవశ్యం. డిమాండ్‌ మేర ప్రభుత్వ విద్యా సంస్థలను విస్తృతం చేయాల్సి ఉంది. పూర్తిస్థాయిలో వసతులు కల్పించి మెరుగైన బోధనకు చర్యలు చేపట్టాలి. సిద్దిపేటలో విశ్వవిద్యాలయం, హుస్నాబాద్‌, మెదక్‌లో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది. గజ్వేల్‌ విద్యా సౌధం నిర్వహణను మెరుగుపర్చాలి. తూప్రాన్‌, రామాయంపేటలో డిగ్రీ, హుస్నాబాద్‌లో ప్రభుత్వ ఐటీఐ, నైపుణ్య శిక్షణ కేంద్రం, పీజీ కళాశాల ఏర్పాటు చేయాలి. వికారాబాద్‌లోనూ పలు విద్యాలయాలను నెలకొల్పాల్సి ఉంది. నాలుగు జిల్లాల్లో 4 వేలకు పైగా విద్యాలయాలు ఉండగా.. 7 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చేస్తున్న వారు 1.50 లక్షల మంది వరకు ఉన్నారు.

ఉపాధికి ఊతమివ్వండి..

సిద్దిపేట, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి అవశ్యం. పెద్దసంఖ్యలో పరిశ్రమలు కరవై ఉపాధికి ఇతర జిల్లాలు, నగరాలు లేదా దేశాలకు వలసలు వెళ్తున్నారు. ఉపాధి పెంచేలా పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వివిధ కార్పొరేషన్ల రుణాలకు దరఖాస్తు చేసుకున్నా ఏళ్లుగా అందని పరిస్థితి. వాటి పరిష్కారానికి కృషి చేస్తారనే నమ్మకం కలిగించాలని కోరుతున్నారు.ః కేంద్ర, రాష్ట్ర రాయితీ పథకాలు త్వరితగతిన అమలు చేయాలి. రాయితీ రుణాలు ఏళ్లుగా మంజూరు కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిశ్రమలు, కుటీర పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రోత్సాహం అవసరం. జిల్లాల్లో పరిశ్రమలు మరిన్ని ఏర్పాటు కావాలి. స్థానికులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. స్వయం ఉపాధికి బాటలు వేయాలి.

రాజకీయంలో వెనుకబాటు..

అన్నింటా ముందంజలో ఉండే యువత రాజకీయంలో మాత్రం వెనుకడుగే. చదువు పూర్తవగానే ఉద్యోగాలు, ఉపాధి వేటలో పడి దేశ నిర్మాణంలో ప్రత్యక్ష పాత్ర పోషించడం లేదు. సరైన ప్రోత్సాహం లేక చతికిలపడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వాలు, పార్టీలు.. యువతకు పెద్దపీట వేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన ఉన్నా ప్రోత్సహించే వారే కరవయ్యారు. ః రాజకీయ పార్టీలు యువతకు వివిధ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్దేశిత మొత్తంలో సీట్ల కేటాయింపు చేపట్టాలి. పదవుల కేటాయింపుల్లోనూ పెద్దపీట వేయాలి.

శిక్షణతో బాసట..

ఎందులోనైనా రాణించాలంటే శిక్షణ అవసరం. ఆ దిశగా యువతలో నైపుణ్యం పెంచేలా శిక్షణ కేంద్రాలను నెలకొల్పాలి. తర్ఫీదు అందిస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసే కేంద్రాలు మరిన్ని అవశ్యం. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల సాధనకు సన్నద్ధం చేసేవి ఉన్నాయి. వీటిని అన్ని జిల్లాలకు విస్తరించాలి. యువత డిమాండ్‌కు అనుగుణంగా కోర్సులు అందుబాటులోకి తేవాలి.

యువతకు అనుగుణంగా డివిజన్‌ కేంద్రాల్లోనూ శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తేవాలి. అవసరం మేరకు అన్ని ప్రాంతాల్లో అధ్యయన కేంద్రాలు తప్పనిసరి. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతస్థాయి ఉద్యోగాల సాధనకు శిక్షణ అందించాలి.

  • మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, నర్సాపూర్‌, గజ్వేల్‌, పటాన్‌చెరు, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్‌లు వస్తాయి.
  • జహీరాబాద్‌ స్థానం పరిధిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
  • చేవెళ్ల పరిధిలో వికారాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు, తాండూరు, పరిగి ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు