logo

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా

‘లోక్‌సభ ఎన్నికల సమర్థ నిర్వహణకు పోలీస్‌ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. పటిష్ఠ నిఘాతో పాటు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం.

Published : 09 May 2024 01:13 IST

ఎస్పీ రూపేష్‌తో ‘న్యూస్‌టుడే’
సంగారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే

‘లోక్‌సభ ఎన్నికల సమర్థ నిర్వహణకు పోలీస్‌ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. పటిష్ఠ నిఘాతో పాటు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా చర్యలు తీసుకుంటున్నామని..’ ఎస్పీ చెన్నూరి రూపేష్‌ పేర్కొన్నారు. ‘న్యూస్‌టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు.

ప్రలోభాలకు గురిచేస్తే..

సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దు. పోస్టులు పెట్టవద్దు. వాట్సప్‌ గ్రూపుల అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలను అతిక్రమించి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇందుకోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక మీడియా మానిటరింగ్‌ కంట్రోల్‌ రూం ఉంది. జిల్లాలో ఎక్కడైనా ఓటర్లను ప్రలోభ పెట్టినట్లు తెలిస్తే.. వెంటనే డయల్‌ 100, కలెక్టరేట్‌లోని కాల్‌సెంటర్‌(1950)కి ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.

నగదు, మద్యం తరలించకుండా..

జిల్లాలో శాసనసభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాం. ఇదే స్ఫూర్తిని లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగిస్తున్నాం. జిల్లాకు సరిహద్దున కర్ణాటక, మహారాష్ట్రలు ఉన్నాయి. అక్రమంగా నగదు, మద్యం జిల్లాలోకి రాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దులో తొమ్మిది చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం. ఇక్కడ కేంద్ర బలగాలు, ఎస్‌ఐ స్థాయి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 15 స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలు రహదారులపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో 12 చోట్ల ప్రత్యేక చెక్‌ పోస్టులున్నాయి. అక్కడ 24 గంటలూ పోలీసు, ఆర్‌టీవో, అటవీ, వాణిజ్య పన్నుల శాఖ, తదితర శాఖల అధికారుల సహకారంతో తనిఖీలు చేపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలిస్తే స్వాధీనం చేసుకుంటున్నాం. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌ విభాగంలో వాటికి ఆధారాలు సమర్పిస్తే తిరిగి ఇచ్చేస్తున్నారు.

కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు

పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు.. ఎవరైనా ర్యాలీలు, రోడ్‌ షోలు, సభలు, సమావేశాలకు ముందస్తుగా పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలి. తప్పనిసరిగా ఎన్నికల నియమావళి పాటించాలి. నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై ఇప్పటికే కేసులు నమోదు చేశాం. వీరిలో ప్రధాన పార్టీలకు చెందిన వారూ ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలి.

కేంద్ర బలగాలు, జిల్లా పోలీసులతో బందోబస్తు

జిల్లావ్యాప్తంగా 96 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. అక్కడ సీసీ కెమెరాలు బిగించాం. జిల్లా స్థాయి అధికారులు, డీఎస్పీలు, టాస్క్‌ఫోర్స్‌ టీంలు, స్థానిక సీఐలు, ఎస్‌ఐల సహకారంతో అక్కడ ప్రత్యేక నిఘా ఉంటుంది. పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు, పోలీసు శాఖ చేపట్టాల్సిన బందోబస్తుపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నాం. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై అవగాహన చర్యలు తీసుకుంటున్నాం. పాత నేరస్థులు, అనుమానితులు ఎన్నికలప్పుడు గొడవలు సృష్టించకుండా ఉండేలా.. ఇప్పటి వరకు 1130 మందిని బైండోవర్‌ చేశాం. ఈ నెల 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌటింగ్‌కు సంబంధించి పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంది.  ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా మూడు వేల మంది కేంద్ర బలగాలు, జిల్లాకు చెందిన వేయి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తాం.

గత నెల 16 నుంచి ఈ నెల 8 వరకు..

  • పట్టుబడిన నగదు: రూ.1.77 కోట్లు
  • స్వాధీనం చేసుకున్న మద్యం: 3767 లీటర్లు
  • బైండోవర్లు: 1130 మంది
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని