logo

ప్రత్యామ్నాయ సాగు.. మెట్ట పంటలే మేలు

యాసంగిలో వరికి బదులుగా మెట్ట పంటల సాగు లాభదాయకమని త్రిపురారం మండలం కంపసాగర్‌ కేవీకే వరి సేద్య విభాగపు శాస్త్రవేత్త భరత్‌ తెలిపారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో శనివారం ‘ఫోన్‌ఇన్‌’ కార్యక్రమం నిర్వహించగా రైతులు

Published : 05 Dec 2021 03:19 IST

ఈనాడు ఫోన్‌ఇన్‌లో కేవీకే శాస్త్రవేత్త భరత్‌

త్రిపురారం, న్యూస్‌టుడే

యాసంగిలో వరికి బదులుగా మెట్ట పంటల సాగు లాభదాయకమని త్రిపురారం మండలం కంపసాగర్‌ కేవీకే వరి సేద్య విభాగపు శాస్త్రవేత్త భరత్‌ తెలిపారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో శనివారం ‘ఫోన్‌ఇన్‌’ కార్యక్రమం నిర్వహించగా రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ప్రశ్న: యాసంగిలో వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల సాగు వల్ల కలిగే లాభాలు తెలపగలరు.    
- వరం పిచ్చయ్య, మేళ్లచెర్వు
సమాధానం: సాగు ఖర్చు తక్కువ. తక్కువ నీటితో అధిక దిగుబడి వస్తోంది. మార్కెట్‌ డిమాండ్‌ అనుకూలంగా పంటను ఎక్కడైనా అమ్ముకునే సౌకర్యం ఉంటుంది.  

ప్రశ్న: పత్తి మొక్క మోడులను భూమిలో కలియదున్నడం ద్వారా ఎటువంటి లాభాలున్నాయి.
- కిశోర్‌, గిరికనేడుతండా, తిరుమలగిరి (సాగర్‌)
సమాధానం: సాధారణంగా ఎకరాకు 6 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తే 9 క్వింటాళ్ల వరకు పత్తి మొక్క మోడులు వస్తాయి. దీనిని షెడ్డర్‌ యంత్రంతో భూమిలో కలియవేయడం ద్వారా ఎకరాకు 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్‌ భూమిలో చేరి భూసారాన్ని పెంచుతుంది. పత్తి పంట తర్వాతి పంటలకు సిఫారసు చేసిన రసాయనిక ఎరువుల మోతాదులో నత్రజనిని 10 కిలోలు, పొటాష్‌ 27 కిలోలు తక్కువ చేసి వేసుకుని రైతన్నలు కొంత మేరకు ఎరువులపై ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

ప్రశ్న: యాసంగి వరి ప్రత్యామ్నాయంగా పెసలు, మినుములు, వేసుకోవచ్చా? వాటి పంట కాలం ఎంత?
- గోపికృష్ణ, వెంకటాద్రిపాలెం, మిర్యాలగూడ మండలం
సమాధానం: యాసంగికి గాను నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు పెసలు, మినుములు వేసుకోవచ్చు. వేసవి పంటగా పెసలు, మినుములు ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు వేసుకోవచ్చు. పెసర పంట కాలం 60 - 65 రోజులు. పెసర రకాలు డబ్ల్యుబీజీ - 42 , 37 ఎమ్‌జీజీ - 295, 347, 348 వాడచ్చు. మినుము పంట కాలం 75 - 80 రోజులు. ఇందులో పి.యు.- 31, డబ్ల్యు.బి.జి. - 26, ఎల్‌.బి.జి.- 787, 752, జి.బి.జి. - 45, 12. వరి మాగాణులకు అనువైన మినుము రకాలు ఎల్‌.బి.జి.645, 685, 648, 709, 752. వీటి పంట కాలం 85 - 90 రోజులు.

ప్రశ్న: బొబ్బర పంటకు అనువైన సమయం, రకాలు, విత్తన శుద్ధి తెలపగలరు.
- లింగస్వామి, మునిపంపుల, రామన్నపేట మండలం
సమాధానం: బొబ్బర పంటను వేసవిలో ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు. రకాలు జి.సి.- 3, వి - 240, సి - 152 , కో - 4 వాడొచ్చు. ప్రతి కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్‌, కాప్టాన్‌, 2 గ్రా.మాంకోజెఎఎబ్‌తో విత్తనశుద్ధి చేసి విత్తితే భూమి, విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్ల బారి నుంచి తొలిదశలో పంటను కాపాడుకోవచ్చు. ఆఖరుగా విత్తే ముందు విత్తనానికి రైజోబియం కల్చరును పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎండు తెగులు సమస్యాత్మక ప్రాంతాల్లో ట్రైకోడెర్మా విరిడి 8 గ్రా.ను ప్రతీ కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

ప్రశ్న: మినుములో ఎరువుల యాజమాన్యం ఎలా? 

 - సోమిరెడ్డి, హాలియా
సమాధానం: ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరానిచ్చే ఎరువులు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌, 50 కిలోల డీఏపీని వాడాలి. వరి తర్వాత మాగాణిలో విత్తుకున్నప్పుడు ఎరువులు వేయడం వీలు పడదు. అవసరం మేరకు పోషకాలను పైపాటుగా పిచికారి ద్వారా అందించాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు మేరకు రసాయనిక ఎరువులు వేయాలి.

ప్రశ్న: నువ్వుల పంటలో కలుపు, నీటి యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి?

 - శంకర్‌నాయక్‌, మఠంపల్లి
సమాధానం: కలుపు నివారణకు పెండిమిథాలిన్‌ 30 శాతాన్ని ఎకరాకు లీటర్‌ చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజుగాని పిచికారి చేసుకోవాలి. మొక్కలు మొలచిన 15 రోజులకు అదనపు మొక్కలను తీసి వేయాలి. విత్తిన 20- 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేసుకోవాలి.
నీటి యాజమాన్యం: విత్తిన వెంటనే పలుచటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి గింజ కట్టే దశల్లో తడులు ఇవ్వాలి. నువ్వు సాగు చేసే నేలలో తేమ ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో మొక్కల శాఖీయోత్పత్తి మాత్రమే జరిగి ఆకులు, కొమ్మలు ఎక్కువగా వచ్చి పూత కాయ రాకుండా నిలిచిపోతుంది.

ప్రశ్న: వేరుసెనగలో పొగాకు లద్దె పురుగు నివారణ ఎలా?  
- భద్రారెడ్డి, డిండి
సమాధానం: పొగాకు లద్దె పురుగు నివారణకు ఎకరాకు 4- 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఎర పంటలుగా ఆముదం, పొద్దుతిరుగుడు 30 - 40 మొక్కలు ఉండేలా విత్తాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కషాయం పిచికారి చేసుకోవాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు నోవల్యురాన 200 మి.లీ., ప్లూబెండమైడ్‌ 40 మి.లీ. ఒక ఎకరానికి సరిపోయేలా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. విషపు ఎరగా వరి తవుడు 5 కిలోలు, అర కిలో బెల్లం, అరకిలో మెనోక్రోటోపాస్‌ 500 మి.లీ.ఎకరా పొలంలో సాయంత్రం వేళ సమానంగా చల్లి తీవ్రంగా ఉన్న పురుగు ఉద్ధృతిని నివారించవచ్చు.    

ప్రశ్న: పొద్దు తిరుగుడు పంటను ఏ నెల వరకు విత్తుకోవచ్చు? పంట కాలం, రకాలు, విత్తన మోతాదును తెల్పండి.
- బోడ్డుపల్లి సత్తయ్య, మల్లాపురం, పీఏపల్లి మండలం
సమాధానం: యాసంగిలో నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 30 వరకు పొద్దు తిరుగుడు విత్తుకోవచ్చు. వేసవిలో అయితే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు అనుకూలం. కేబీఎస్‌హెచ్‌ 44, ఎస్‌డీఎస్‌హెచ్‌ 1, డీఆర్‌ఎస్‌హెచ్‌ 1, కేబీఎస్‌హెచ్‌ 78 రకాలు వాడొచ్చు. విత్తన మోతాదు 2.5 - 3 కిలోలు ఎకరాకు సరిపోతోంది. పంట కాలం 90 - 95 రోజులు.

ప్రశ్న: వేరుసెనగ పంటలో జిప్సమ్‌ ఎంత మోతాదులో, ఏ దశలో వేసుకోవాలి?    

- శ్రీను, నేరెడుగొమ్ము  
సమాధానం: ఎకరానికి 200 కిలోల జిప్సమ్‌ను పూత దశ పూర్తయి ఊడలు దిగే సమయంలో మొదళ్ల దగ్గర వేసి మట్టి ఎగదోయాలి. విత్తిన 45 రోజుల తర్వాత ఎటువంటి అంతర సేద్యం చేయరాదు.

ప్రశ్న: డ్రమ్‌ సీడర్‌ ద్వారా సాగు చేసే వరిలో కలుపు నివారణకు ఎటువంటి రసాయనాలు వాడాలి?
- రవి, గ్యారకుంటపాలెం, మాడ్గులపల్లి మండలం
సమాధానం: ఎకరాకు ప్రెటిలీక్లోర్‌, సెఫ్‌నర్‌ మందును 600 - 800 మి.లీ. విత్తిన 3- 5 రోజుల లోపు, పైరజో సత్ప్యరాన్‌ ఇథైౖల్‌ 80 - 100 గ్రా. వాడాలి. ఎకరాకు సైహలోఫాప్‌ పి ఇథైల్‌ 300 మి.లీ. (ఊద, బడిపిలి), ఫినాక్స్‌ ప్రాప్‌పిఇథైౖల్‌ 250 మి.లీ. విత్తిన 15 రోజులకు, బిస్‌ఫైరిబాక్‌ సోడియం 100 మి.లీ. విత్తిన 20 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బిస్‌పైరిబాక్‌ సోడియం వెడల్పాకు గడ్డి జాతిని కూడా ఆరికడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని