logo

బాటసారి.. ఇదిగో రహదారి..!

రాష్ట్రంలో అత్యధిక జాతీయ రహదారులు ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగానే వెళ్తున్నాయి. పది రహదారులు 773.కి.మీ. మేర విస్తరించి ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల గుండా వెళ్తూ రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి.

Published : 27 Mar 2023 03:16 IST

ఈనాడు, నల్గొండ, న్యూస్‌టుడే, గరిడేపల్లి

రాష్ట్రంలో అత్యధిక జాతీయ రహదారులు ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగానే వెళ్తున్నాయి. పది రహదారులు 773.కి.మీ. మేర విస్తరించి ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల గుండా వెళ్తూ రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఇంత పెద్ద విస్తీర్ణంలో జాతీయ రహదారులుండటం రాష్ట్రంలోనే ప్రథమం.  

హైదరాబాద్‌ - విజయవాడ

రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వాహన రద్దీ ఉన్న మార్గంగా హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి ప్రసిద్ధి చెందింది. ఫుణె నుంచి మచిలీపట్నం వెళ్లే ఈ రహదారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో దండు మల్కాపూర్‌లో మొదలై చౌటుప్పల్‌, చిట్యాల, నకిరేకల్‌, సూర్యాపేట, కోదాడ మీదుగా 186 కి.మీ.మేర సాగుతోంది.

హైదరాబాద్‌ - వరంగల్‌  

హైదరాబాద్‌ నుంచి మొదలై ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు వెళ్లే ఈ రహదారి ఉమ్మడి జిల్లాలో బీబీనగర్‌, భువనగిరి, ఆలేరు మీదుగా 48 కి.మీ. మేర ఉంది.

బిక్కుమళ్ల - నకిరేకల్‌  

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలను కలిపుతూ సాగే ఈ రహదారి సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం బిక్కుమళ్ల వద్ద మొదలై నూతన్‌కల్‌, తుంగతుర్తి, అర్వపల్లి మీదుగా నకిరేకల్‌ వద్ద ముగుస్తుంది. ఈ రహదారిలో భాగంగా మూసీ నదిపై అర్వపల్లి వద్ద బ్రిడ్జి నిర్మించడంతో నూతన్‌కల్‌, తుంగతుర్తి, అర్వపల్లి ప్రాంత వాసులు హైదరాబాద్‌ వెళ్లాలంటే సూర్యాపేటకు వెళ్లకుండానే నకిరేకల్‌ మీదుగా వెళ్తున్నారు. దీని వల్ల సుమారు 35 కి.మీ. మేర దూర భారం తగ్గింది. ఇది మొత్తం 65 కి.మీ. మేర సాగుతోంది.

నకిరేకల్‌ - నాగార్జునసాగర్‌  

నకిరేకల్‌ నుంచి నల్గొండ మీదుగా హాలియా, నాగార్జునసాగర్‌ వరకు ఈ రహదారి వెళ్తుంది. పనులు తుది దశలో ఉన్నాయి. తానంచెర్ల - రేణిగుంట మార్గంలో నిర్మిస్తున్న ఈ రహదారి నాగార్జునసాగర్‌ అనంతరం ఏపీలోని మాచర్ల మీదుగా రేణిగుంట వరకు సాగుతుంది. ఇది మొత్తం జిల్లాలో 78 కి.మీ. మేర విస్తరించి ఉంది.

కోదాడ  - జడ్చర్ల  

కర్ణాటక రాష్ట్రంలో మొదలై మహబూబ్‌నగర్‌, జడ్చర్ల మీదుగా నల్గొండ జిల్లాలోని డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద ఈ జాతీయ రహదారి ప్రవేశిస్తుంది. దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ వరకు మొత్తం 156 కి.మీ. మేర విస్తరించి ఉంది. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ రహదారి నిర్మాణం వల్ల ఉమ్మడి జిల్లాలోని వాణిజ్య ప్రాంతాలైన దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగవటమే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కోల్‌కతాకు దగ్గరి మార్గం ఇది.

కోదాడ - ఖమ్మం  

కోదాడ నుంచి ఖమ్మం మీదుగా కురవి వెళ్లే ఈ రహదారి ఉమ్మడి జిల్లాలో కోదాడ వద్ద ప్రారంభమై పాలేరు వాగు వద్ద ముగుస్తుంది. మొత్తం 13 కి.మీ. మేర విస్తరించి ఉంది.

సూర్యాపేట - జనగామ

సూర్యాపేట నుంచి జనగాం, సిద్ధిపేట మీదుగా సిరిసిల్ల వరకు వెళ్లే ఈ రహదారి సూర్యాపేట నుంచి అర్వపల్లి, ఫణిగిరి, తిరుమలగిరి మీదుగా వెళ్తుంది. ఉమ్మడి జిల్లాలో 45 కి.మీ. మేర విస్తరించి ఉంది.

సూర్యాపేట - కొవ్వూరు (రాజమహేంద్రవరం)

సూర్యాపేట నుంచి చివ్వెంల, మోతె మీదుగా ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు వరకు ఈ రహదారి సాగుతోంది. సూర్యాపేట జిల్లాలో ఈ రహదారి 32 కి.మీ. మేర విస్తరించి ఉంది. పనులు తుది దశకు చేరుకున్నాయి.

సంగారెడ్డి - చౌటుప్పల్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌ - ఉత్తర భాగం)

ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌)లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నిర్మిస్తున్న ఈ రహదారి సంగారెడ్డి వద్ద మొదలై నర్సాపూర్‌, తుఫ్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌ మీదుగా ఉమ్మడి జిల్లాలో ప్రవేశిస్తుంది. తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ మండలాల్లోని గ్రామాలను కలుపుతూ చౌటుప్పల్‌ వద్ద ముగుస్తుంది. హైదరాబాద్‌ బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)కి ఆవల నిర్మిస్తున్న ఈ రహదారి వల్ల రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగవనుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 కి.మీ. మేర ఈ రహదారి విస్తరించి ఉంటుంది.

హైదరాబాద్‌ - కొత్తగూడెం  

హైదరాబాద్‌ సమీపంలోని బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) గౌరెల్లి నుంచి ఉమ్మడి జిల్లాలోని వలిగొండ, అర్వపల్లి మీదుగా కొత్తగూడెం వరకు ఈ రహదారి సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో పోచంపల్లి మండలంలో మొదలై అర్వపల్లి మండలంలో ముగుస్తుంది. దీని వల్ల ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం అరగంట ముందుగా వెళ్లవచ్చు. సుమారు 35 కి.మీ. మేర ప్రయాణ దూరం తగ్గుతుంది. 230 కి.మీ. మేర నిర్మించే ఈ రహదారిని నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం గౌరెల్లి నుంచి వలిగొండ వరకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ రహదారి ఉమ్మడి జిల్లాలో 106 కి.మీ. మేర విస్తరించి ఉంది. ఈ మార్గం పూర్తి కావాలంటే మరో రెండేళ్లకు పైగా సమయం పట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని