logo

ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్‌

ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్‌ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యునికేషన్‌(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.

Published : 26 Apr 2024 04:38 IST

నల్గొండలో  ఓటరు చైతన్యం ఛాయా చిత్ర ప్రదర్శనను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ దాసరి హరిచందన, చిత్రంలో సీబీసీ జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర్‌రావు, తదితరులు

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్‌ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యునికేషన్‌(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఓటర్లు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. యువకులు పోలింగ్‌ రోజున సమయాన్ని వృథా చేయకుండా ఓటు వేయాలని కోరారు. ఓటరు అవగాహన కోసం జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్‌ పాకెట్ల వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రలోభ రహితంగా ఎన్నికల నిర్వహణకు సహకరించే బాధ్యత ఓటర్లదేనని తెలిపారు. ఈ ఛాయచిత్ర ప్రదర్శన ఈనెల 27 వరకు కొనసాగనుంది. ఈ ప్రదర్శనలో 1951 నుంచి ప్రారంభమైన భారత ఎన్నికల చరిత్ర, మొబైల్‌ యాప్‌లు, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల వరకు అన్ని అంశాను ప్రదర్శనలో వివరించారు. జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు, సీబీసీ జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ డా.కొండల్‌రావు, ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ అరుణ్కుమార్‌, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఘనశ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాకు వచ్చిన పరిశీలకులు

నల్గొండ సంక్షేమం: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్‌కుమార్‌ మాణిక్‌రావు సూర్యవంశీ(2010 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి) గురువారం జిల్లాకు వచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తన ఛాంబర్‌లో వారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. పోలింగ్‌ ముగిసే వరకు ఆయన ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం జిల్లాకు నియమితులైన పోలీసు పరిశీలకుడు ఆమోఘ్‌జీవన్‌ గాంకర్‌(2011 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి)తో కలిసి ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎస్పీ చందనాదీప్తి, అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

నల్గొండ విద్యావిభాగం: ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ దాసరి హరిచందన సూచించారు. ముందస్తు జాగ్రత్తచర్యలపై జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా.కొండల్‌రావు స్వయంగా రచించి, రూపొందించి గానం చేసిన ఆడియో పాటల సీడీలను గురువారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో  ఆవిష్కరించారు. ఎండలు ఎక్కువ ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే వదులు దుస్తులు, లేత పల్చటివి ధరించాలన్నారు. నిల్వ ఉంచిన ఆహారం, మాంసాహారం తినకుండా చూసుకోవాలన్నారు. ద్రవపదార్ధాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. ఓఆర్‌ఎస్‌ పొట్లాలు ప్రభుత్వ ఆసుపత్రులు, ఆశావర్కర్ల వద్ద సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా.కొండల్‌రావు, సమాచారశాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు, సీబీసీ జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వరరావు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఘనశ్యాం, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని