logo

పోరుబాట.. ఓటు మాట..!

ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్‌ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్‌కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు.

Published : 26 Apr 2024 06:29 IST

భువనగిరిలోని అంబేడ్కర్‌ సెంటర్లో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌, చిత్రంలో ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఈనాడు, నల్గొండ - భువనగిరి, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్‌ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్‌కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. సాయంత్రం 7.10 గంటలకు భువనగిరికి చేరుకున్న ఆయనకు సాయిబాబా మందిరం వద్ద మహిళలు బోనాలు, నృత్యాలు, కోలాటాలతో స్వాగతం పలికారు. ఆదివాసీ నృత్యాలు, ముస్లింల  వాయిద్యాలు (మర్ఫీ) అలరించాయి. లోక్‌సభ నియోజకవర్గంలోని వివిధ సెగ్మెంట్ల నుంచి సాయంత్రం నుంచే ప్రజలు, పార్టీ శ్రేణుల రాక కనిపించింది. కేసీఆర్‌ బస్సు ముందు కార్యకర్తలు బాణసంచా భారీగా కాల్చారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకోగా..మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ‘ఒకటే జననం ఒకటే మరణం’ పాటపాడి అలరించారు.

  • మిర్యాలగూడ, సూర్యాపేటలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌పై విరుచుకుపడ్డ కేసీఆర్‌ భువనగిరి రోడ్‌షోలో మాత్రం ప్రధానంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ఆ పార్టీ అభ్యర్థి, గతంలో భారాస నుంచి ఎంపీగా ఉన్న బూర నర్సయ్య ఈ ప్రాంతానికి ఏం చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీని హామీల అమలుపై ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచాలంటే భారాసను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీతో పోరాటమే తప్ప రాజీ లేదని స్పష్టం చేశారు. భువనగిరి పురపాలికలో భాజపా, కాంగ్రెస్‌ పొత్తును ప్రస్తావిస్తూ ఆ రెండు పార్టీలూ ఒకటేనని తెలిపారు.
  • భువనగిరిలో మైనార్టీల ప్రాబల్యం అధికంగా ఉండటంతో వారిని ఆకట్టుకోవడానికి ఉర్దూలో మాట్లాడుతూ మద్దతు కోరారు. గతంలో వారికి ఉన్న పథకాలు, ప్రస్తుత ప్రభుత్వంలో అందుతున్న పథకాలను అడుగుతూ తేడాను గుర్తించాలన్నారు. తమది లౌకిక పార్టీ అని, ఇకముందూ అలానే ఉంటామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారాసను ఎందుకు గెలిపించాలో వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల భారాస ఓడినా బాధ లేదని..పార్టీ శ్రేణులు, ప్రజల గుండెల్లా తానున్నానని వారికి భరోసా కల్పించారు.
  • అంతకుముందు సూర్యాపేటలోని జగదీశ్‌రెడ్డి నివాసంలో బస చేసిన కేసీఆర్‌ను ఉదయం నుంచి వివిధ వర్గాల వారు కలిశారు. ఉమ్మడి జిల్లా నాయకులతో ప్రస్తుత పరిస్థితిపై ఆయన చర్చించినట్లు తెలిసింది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే తప్ప బతుకులు బాగుపడవన్న నమ్మకంతో 15 ఏళ్లు తెగించి కేసీఆర్‌ కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాకారం చేశారన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని