logo

బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం

వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం.

Updated : 26 Apr 2024 06:40 IST

ఎన్‌.వాసుదేవ దీక్షితులు, ఏసీపీ, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌

న్యూస్‌టుడే, మఠంపల్లి: వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. ఉదయాన్నే స్నేహితులమంతా సైకిళ్లపై అక్కడకు చేరుకుని క్రీడలకు కావలసిన ఏర్పాట్లు చేసుకునేవాళ్లం. మాది మఠంపల్లి మండలం అల్లీపురం. అంజలీపురం మా గ్రామంలో కలిసే ఉంటుంది. 50మందికి పైగా నవచైతన్య యువజన సంఘం పేరుతో క్రికెట్‌, క్యారమ్స్‌, వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనేవాళ్లం. అలిసి పోయి ఇంటికి చేరాక కొంతసేపు విశ్రాంతి తీసుకుని మా ఊరికి సమీపంలోని రాళ్లగడ్డ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లేవాళ్లం. గుబ్బ కాయలు, ఈత కాయలు, తాటి కాయలు ఇలా వేటినీ వదిలేవాళ్లం కాదు. రాత్రి వెన్నెల్లో సరదాగా కబుర్లు చెప్పుకొనేవాళ్లం. ఇప్పటికీ చిన్ననాటి స్మృతులు తలచుకుంటే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. ఈతరం పిల్లలు వీటన్నింటికీ దూరమవుతున్నారనిపిస్తుంది. వాళ్లకి చరవాణే లోకంగా మారిపోతోంది. బంధాలు, బాంధవ్యాలు కనుమరుగవుతున్నాయి. తల్లిదండ్రులు సెలవుల్లో పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. చదువే కాదు.. ఆటలూ ముఖ్యమేనన్న విషయాన్ని గుర్తించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని