logo

తూకం.. నిలువునా మోసం

ఒకవైపు ప్రకృతి సృష్టించిన అకాల వర్షాలు, వడగండ్లు మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. మరోవైపు కొంత మంది వ్యాపారులు వేబ్రిడ్జిల్లో మోసాలతో నిండా ముంచుతున్నారు.

Published : 27 Mar 2023 03:16 IST

వేబ్రిడ్జి కొలతల్లో వెలుగు చూసిన తేడా

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒకవైపు ప్రకృతి సృష్టించిన అకాల వర్షాలు, వడగండ్లు మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. మరోవైపు కొంత మంది వ్యాపారులు వేబ్రిడ్జిల్లో మోసాలతో నిండా ముంచుతున్నారు. ఇప్పుడిప్పుడే జిల్లాలో మామిడి సీజన్‌ ప్రారంభమైంది. కొందరు రైతులు మామిడి కాయలను విక్రయించేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది వ్యాపారులు ఎప్పటిలాగే మోసం చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరికొంత మంది వేబ్రిడ్జి నిర్వాహకులతో కుమ్మక్కై తూకాల్లో భారీ తేడాలతో కర్షకులకు శఠగోపం పెట్టాలని చూస్తున్నారు. ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం కందగట్ల గ్రామానికి చెందిన కౌలు రైతు బండారు లచ్చయ్య శనివారం రాత్రి తన తోటలో పండిన మామిడి కాయలను ట్రాక్టరులో వేసుకొని సూర్యాపేటకు తీసుకొచ్చారు. అంజనాపురి కాలనీ సమీపంలోని ఓ వేబ్రిడ్జిలో తూకం వేయగా 4,640 కిలోలున్నట్లు రసీదు ఇచ్చారు. అనుమానంతో వెంటనే ఖమ్మం క్రాస్‌ రోడ్డులోని మరో వేబ్రిడ్జి వద్దకు వెళ్లి తూకం వేయగా 4,850 కిలోలుగా రసీదు ఇచ్చారు. తేడా 210 కిలోలు(2.10 క్వింటాలు) ఉంది. అంటే క్వింటాకు 4.32 కిలోలు తక్కువ చూపినట్లు తెలుస్తోంది. తేడా రావడంపై ఇదేంటని మొదట తూకం వేసిన వేబ్రిడ్జి వద్దకు వెళ్లి ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు రైతు లచ్చయ్య ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో సమీపంలోని మరో మామిడి వ్యాపారికి తన సరకును విక్రయించి రైతు వెనుదిరిగారు.. అధికారులు స్పందించి అడ్డగోలుగా వెలుస్తున్న మామిడి వ్యాపారులు, అనుబంధంగా పనిచేస్తున్న వేబ్రిడ్జిలను పర్యవేక్షించాల్సి ఉంది. ఈ విషయమై జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి వెంకటేశ్వర్లును ‘న్యూస్‌టుడే’ను వివరణ కోరగా.. ‘సంబంధిత వేబ్రిడ్జిల్లో తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామ’ని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని