logo

పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..

లోక్‌సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే.

Published : 20 Apr 2024 04:50 IST

 

లోక్‌సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రంలో ఏదైనా రాజకీయ పార్టీ తరఫునా? లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా అనేది రాయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీ అభ్యర్థులుగా ఎంపికైనవారికి ఆ పార్టీ అధికార ప్రతినిధి ‘బీ’ ఫారంపై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు రాసి దానిపై ముద్ర వేసి ఇస్తారు. దీన్ని ఎన్నికల అధికారికి అభ్యర్థి తన నామినేషన్‌ పత్రంతో పాటు అందజేయాల్సి ఉంటుంది. మరి..ఈ ‘బీ’ ఫారాన్ని రాజకీయ పార్టీకి సంబంధించినవారు ఎవరైనా, ఎంత మందికైనా ఇవ్వవచ్చా? అంటే అలా కుదరదు. రాజకీయ పార్టీ తమలో ఒకరిని అంటే రాష్ట్ర అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసి అతనికి మాత్రమే జారీ చేసే అధికారాన్నిస్తూ ‘ఏ’ ఫారాన్ని ఇస్తారు. ఇతను మాత్రమే ‘బీ’ ఫారాన్ని జారీ చేయాలి. తనకు మా పార్టీ తరఫున ‘బీ’ ఫారం జారీ చేసే అధికారం ఇచ్చారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తెలియపర్చి తన ‘ఏ’ ఫారాన్ని అందజేస్తారు. పార్టీల అభ్యర్థులు ‘బీ’ ఫారాన్ని నామినేషన్‌తో పాటు అందజేసినప్పుడు ‘ఏ’ ఫారం పొందిన వ్యక్తే ‘బీ’ ఫారాన్ని జారీ చేశారా? అనేది ఎన్నికల అధికారి ధ్రువీకరించుకుంటారు. ఒక నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక ‘బీ’ ఫారాన్ని మాత్రమే ఎన్నికల అధికారి గుర్తిస్తారు. అతనికే పార్టీ గుర్తును కేటాయిస్తారు. ‘బీ’ ఫారం సకాలంలో అందజేయని అభ్యర్థులను స్వతంత్రులుగా భావిస్తారు.

 న్యూస్‌టుడే, చౌటుప్పల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని