logo

చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్‌

ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 05 May 2024 04:36 IST

నేరేడుచర్ల: ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చిత్రంలో ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

గరిడేపల్లి, మఠంపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు గ్రామీణం, హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గరిడేపల్లిలో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ.. భాజపా మతపరమైన అల్లర్లు సృష్టించి రిజర్వేషన్‌లు తొలగించే కుట్ర చేస్తుందన్నారు. కాంగ్రెస్‌, తాను మంత్రిగా ఉన్నంత కాలం కృష్ణా, గోదావరిలోని చుక్క నీరు కూడా వదులుకోబోమని పేర్కొన్నారు. భారాస కనుమరుగవుతుందనే బాధలో కేసీఆర్‌, జగదీశ్‌రెడ్డి ఏదో మాట్లాడుతున్నారని, ఆ పార్టీకి ఎంపీ సీట్లు రాకపోవడమే కాకుండా, ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

  • మఠంపల్లి ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ నాయకులకు దిశానిర్దేశం చేశారు. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లోని అన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మఠంపల్లి ఎన్నికల కార్యక్రమాలను సమన్వయం చేసుకునేందుకు త్రిసభ్య కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. మఠంపల్లికి ప్యాసింజర్‌ రైలు కోసం రఘువీర్‌ కృషి చేస్తారని చెప్పారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత భాజపా, భారాసకు లేదన్నారు. తన కుమారుడు స్వల్ప అస్వస్థతకు గురి కావడం వల్ల సమావేశానికి హాజరు కాలేకపోయారని తెలిపారు.
  • ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం హుజూర్‌నగర్‌ సభలో రెండు నిమిషాలు మాట్లాడి తనకు ఆరోగ్యం బాగోలేదని వేదిక నుంచి దిగిపోయారు. తనకు స్వల్ప అస్వస్థత ఉందని, నిలబడి మాట్లాడలేకపోతున్నానని మఠంపల్లి సభలో ప్రకటించి కూర్చొని మాట్లాడారు.
  • పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ.. గుండెబోయిన గూడెం ఎత్తిపోతల పథకానికి ఎన్నికల తర్వాత నిధులు కేటాయించి త్వరలో పూర్తి చేస్తామన్నారు. జాన్‌పహాడ్‌ దర్గా అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించి శాశ్వత సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారాస, భాజపాలకు డిపాజిట్లు కూడా రావన్నారు.
  • నేరేడుచర్ల ప్రధాన కూడలి వద్ద మంత్రి మాట్లాడుతూ..భారాసకు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కదన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం, ధరలు పెరిగిపోయాయని, కేసీఆర్‌ మాదిరిగా ప్రధాని మోదీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ గెలుపు పార్టీకి ఎంత ముఖ్యమో, దేశానికి అంతే ముఖ్యమని నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, నేరేడుచర్ల పురఛైర్మన్‌ ప్రకాష్‌, జడ్పీటీసీ సభ్యుడు నర్సయ్య, కాంగ్రెస్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని