logo

ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు.

Published : 05 May 2024 04:43 IST

ఫోన్‌ల ద్వారానే కీలక నాయకుల మద్దతు కోరుతున్న అభ్యర్థులు

ఈనాడు, నల్గొండ : లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. భాజపా, సీపీఎం మాత్రమే గత కొన్ని రోజులుగా నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేస్తుండగా.. మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం కంటే సమీక్షలు, వ్యూహ రచనలకే ప్రాధాన్యమిస్తున్నారు. రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచే ఎండలు మండిపోతుండటం, సగటున 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అభ్యర్థులు సైతం ప్రచారానికి సుముఖత చూపించడం లేదు. ప్రధాన పార్టీల్లో ఆయా ముఖ్యనేతలు వచ్చినప్పుడు రాత్రి పూట ఏర్పాటు చేసే రోడ్‌షోలు, కార్నర్‌ సమావేశాల్లోనే ఎక్కువ మంది అభ్యర్థులు పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల ఉదయపు నడక, అవసరం అనుకుంటే ఉదయం 9 గంటల వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా కార్యకర్తలతో పార్టీ అంతర్గత సర్వేలు, వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారంపై సమీక్షలు చేస్తూ ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇతర పార్టీల్లో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీలకు ఫోన్లు చేస్తూ తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ప్రధాన పార్టీల అధిష్ఠానాలు సైతం ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ లోపాలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలు సూచిస్తున్నాయి.

ముఖ్య నాయకులతో గెలుపు వ్యూహాలు

రెండు స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ ఒక వైపు మండలాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తూ మండల కేంద్రాల్లో రాత్రి రోడ్‌షోలు, కార్నర్‌ సమావేశాలను నిర్వహిస్తోంది. నల్గొండలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భువనగిరి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి తోడుగా ప్రచారం చేస్తున్నారు. లోక్‌సభ పరిధి పెద్దది కావడం, అన్ని గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఆయా ప్రాంతాల్లోని ముఖ్య నాయకులతో గెలుపు వ్యూహాలపై చర్చించి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలకే ఎక్కడికక్కడ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. రెండింటిలోనూ ఏడు సెగ్మెంట్లకు గానూ ఆరుగురు ఎమ్మెల్యేల చొప్పన కాంగ్రెస్‌ వారే ఉండటంతో ఇది అధికార పార్టీకి అదనపు బలం కానుంది.

ఈ ఎన్నికల్లో రెండింటిలో కనీసం ఒకదాంట్లోనైనా గెలుపు తీరాలను చేరాలని భాజపా సర్వశక్తులు ఒడ్డుతోంది. రేపు (సోమవారం) భువనగిరి, నల్గొండలో జరిగే పార్టీ అభ్యర్థుల ప్రచారానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా రానున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించిన నాయకులు, పోలింగ్‌ నాటికి మండలాల్లో కనీసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటిలో అభ్యర్థులు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు గతంలో భారాస నుంచి ప్రజాప్రతినిధులుగా గెలుపొందడంతో ఆ పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలకు తమకు మద్దతునివ్వాలని కోరుతున్నట్లు తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న భారాస ఇటీవల ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన కేసీఆర్‌ బస్సుయాత్రతో కొంత జోష్‌ వచ్చింది. నల్గొండ, భువనగిరి రెండు స్థానాల్లోని అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్‌ క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లోనే ఇప్పటి వరకు ప్రచారం చేయడంతో మిగిలిన ప్రాంతాల్లోని నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసినా..క్షేత్రస్థాయిలో ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యేల వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దాలని పార్టీ అధిష్ఠానం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించడంతో ఆయన శనివారం ఇద్దరు అభ్యర్థులతో పార్టీ ప్రచారం, ఇతర అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని