logo

రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన

‘ముఖ్యమంత్రి కాగానే రేవంత్‌రెడ్డి ఈ (భువనగిరి) ప్రాంత ప్రజల మేలు కోరి మూసీ ప్రక్షాళనను రూ.50 వేల కోట్లతో చేపడుతామని వెల్లడించారు.

Published : 07 May 2024 06:48 IST

‘ఈనాడు’తో భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

 

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, భువనగిరి : ‘ముఖ్యమంత్రి కాగానే రేవంత్‌రెడ్డి ఈ (భువనగిరి) ప్రాంత ప్రజల మేలు కోరి మూసీ ప్రక్షాళనను రూ.50 వేల కోట్లతో చేపడుతామని వెల్లడించారు. అందుకు లండన్‌లోని థేమ్స్‌ నదిని సైతం పరిశీలించారు. గత ప్రభుత్వాలు మూసీ ప్రక్షాళనకు కమిటీలు వేసి కాలయాపన చేశాయి తప్పితే చర్యలు తీసుకోలేద’ని కాంగ్రెస్‌ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి సోదరుల హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని..తాను ఎంపీగా ఎన్నికైతే అందరిని కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మరోసారి భువనగిరి కోటపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని అంటున్న ఆయనతో ‘ఈనాడు’ పలు అంశాలపై ముఖాముఖీ మాట్లాడారు.

భారాస నిర్లక్ష్యంతోనే గుట్టకు రైలు ప్రయాణం ఆలస్యం..

రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 20 శాతం నిధులు చెల్లించకపోవడం, అప్పటి భారాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే యాదగిరిగుట్టకు (రాయిగిరి)రావడానికి భక్తులకు రైలు ప్రయాణం ఆలస్యమైంది. ఎంపీగా గెలిపిస్తే రాష్ట్రానికి పలు శాఖల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కొట్లాడుతా. విభజన హామీలను సాధించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో దిల్లీలో ప్రయత్నం చేస్తాను. మా ప్రభుత్వం మౌలిక వసతులు, పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో హయత్‌నగర్‌ వరకు రానున్న మెట్రోను చౌటుప్పల్‌ వరకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను. భువనగిరి, జనగామ, ఆలేరుల్లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపడానికి సంబంధిత అధికారులతో మాట్లాడుతాను.

యాదగిరిగుట్టగా మార్పు..

పోచంపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట, కొలనుపాక కలిపి ఆధ్యాత్మిక సర్క్యూట్‌గా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తా. భువనగిరి కోటపైకి రోప్‌వే తీసుకువస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చినా నెరవేరలేదు. స్థానిక ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో త్వరలోనే ఇక్కడకు రోప్‌వే రానుంది. ఎంతో కాలం నుంచి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న యాదగిరిగుట్టను గత ప్రభుత్వం యాదాద్రిగా మార్చి సామాన్య భక్తులకు దూరం చేసింది. అక్కడ భక్తుల బసకు ఎలాంటి వసతులు లేవు. ఎన్నికల కోడ్‌ ముగియగానే సీఎంతో ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహించి యాదాద్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి యాదగిరిగుట్టగా మారుస్తాం.

రహదారుల నిర్మాణానికి కృషి..

హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిని మల్కాపూర్‌ వరకు ఆరు వరుసలుగా మార్చడంతో పాటూ పలు చోట్ల అండర్‌పాసుల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కృషి చేశారు. ఆయనతో కలిసి చౌటుప్పల్‌, చిట్యాల లాంటి ప్రాంతాల్లో అండర్‌పాసుల నిర్మాణానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తాను. మా ప్రభుత్వంలో దీనిని ప్రాధాన్యతా అంశంగా చేర్చి రహదారుల్లో బ్లాక్‌స్పాట్‌లపై జరుగుతున్న ప్రమాదాలను శాశ్వతంగా నివారించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

ఆర్‌ఆర్‌ఆర్‌తో డ్రైపోర్టు అనుసంధానం

రాష్ట్రానికి సముద్రమార్గం లేనందున చిట్యాల ప్రాంతంలో డ్రైపోర్టును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడాం. సమీపంగా ఉన్న ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్టులనుంచి వచ్చే సరకులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు డ్రైపోర్టు ద్వారా సరఫరా చేయడానికి వీలుంటుంది. త్వరలోనే చౌటుప్పల్‌ వరకు ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం సైతం ప్రారంభం కానుంది. ఎన్నికలు కాగానే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)తో ఈ ప్రతిపాదనలను అమలు చేస్తాం.

ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి సేవలపై దృష్టి..

ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి సేవలపై కాంగ్రెస్‌ పార్టీ ప్రతి పక్షంలోనే పోరాటం చేసింది. ప్రస్తుతం నాలుగేళ్లయినా అక్కడ ఇంకా భవన నిర్మాణాలే సాగుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చిన 150 రోజుల్లో ఎయిమ్స్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పాం. ఎన్నికల కోడ్‌ ముగియగానే ఎయిమ్స్‌పై సమీక్షించి కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి పనులు తొందరగా పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకుంటాం. బీబీనగర్‌ ఎయిమ్స్‌ సమయంలో దేశంలో మంజూరైన ఎయిమ్స్‌లు ప్రస్తుతం పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని