logo

మాట తప్పితే రాజీనామా చేస్తావా..!

ప్రియమైన లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థికి సమస్కారం. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్న తలంపు.

Published : 07 May 2024 06:52 IST

ప్రియమైన లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థికి సమస్కారం. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్న తలంపు.. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించాలన్న పట్టుదల.. నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్న ఆలోచన.. ఇంకా.. ఎన్నో ఆలోచనలు, ఆశయాలతో పోటీ చేస్తున్నావు. నీ ఆస్తులు ప్రకటిస్తున్నావు.. అప్పులూ చెబుతున్నావు, కేసులూ వివరిస్తున్నావు.. ఎన్నికల సంఘం అడిగిన అన్నింటికీ తూ..చా.. తప్పక కట్టుబడి ఉంటానని హామీ పత్రం సమర్పిస్తున్నావు. ఇదంతా బాగానే ఉంది..

 ప్రచారం పేరుతో.. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు.. వీటిని అట్టహాసంగా నిర్వహించేందుకు డప్పులు, కళాకారులు, మందీమార్బలం, హంగు, ఆర్భాటం, వాటి కోసం లెక్కకు మించి ఖర్చు చేస్తున్నావ్‌.. పార్టీ టికెట్‌ కోసం మీ అధిష్ఠాన పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడం మొదలు.. ‘కాసు’క్కూర్చున్న  అసంతృప్తి నాయకుల్ని, ఎగస్పార్టీలోని నాయకుల్ని, చోటా, మోటా ప్రజాప్రతినిధుల్ని దారిలోకి తెచ్చుకున్నావ్‌. ఇక.. ప్రచారంలో పెద్ద నేతల్ని తీసుకువచ్చి కొత్త, కొత్త పథకాలు ప్రకటింపజేస్తున్నావ్‌. ఊరూరు, వాడవాడ తిరుగుతూ లెక్కకు మించిన, స్థోమతకు అందని హామీలిస్తున్నావ్‌, కుల సంఘాల్ని కూడగొడుతున్నావ్‌. మతాలను ఉపయోగించుకుంటున్నావ్‌. ఇతర పార్టీల కన్నా ఎక్కువ డబ్బులిచ్చి, మద్యమిచ్చి, కానుకలిచ్చి, ఏదడిగితే.. అదిచ్చి ఓటర్లను కొంటున్నవ్‌. దూరాన ఉన్న ఓటర్లకు ఖర్చులిచ్చి, వాహనాలు పెట్టి రప్పిస్తున్నావ్‌. ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నావ్‌. చేయరాని పనులు చేస్తున్నావ్‌.

 ఇక గెలిచాక..

విజయోత్సవాల తరువాత కనిపించకుండా పోతున్నావ్‌. చోటా, మోటా నాయకులు కనిపించరు నీకు. ఓటర్లు అసలే కనిపించరు. ఊర్ల్లకు రావు. మా బాధలు పట్టించుకోవు. మౌలిక వసతుల మాట మరిచిపోతావ్‌. హామీలూ గుర్తుండవ్‌. ప్రాంతాలనూ పట్టించుకోవు. పథకాలు ప్రకటనలకే పరిమితమవుతాయి. నీ పైరవీలు, నీ కాంట్రాక్టులు, నీ పనులు, నీ మేలు, నీ ఆదాయమే నువ్‌ చూసుకుంటావ్‌.

ఇలా కాదు..

ఎన్నికల ప్రచారంలో కరపత్రాలు కాదు పంచాల్సింది. హామీలు అమలు చేయకపోతే.. మౌలిక సదుపాయాలు కల్పించకపోతే.. పథకాలు పక్కగా అమలు చేయకపోతే.. ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో తోడుండకపోతే.. నా పదవికి రాజీనామా చేస్తా. లేకపోతే ఓటింగ్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ (రీకాల్‌) చేసి, పదవీచ్యూతుడ్ని చేయండని బాండ్‌ పేపర్లు రాసి ఓటర్లకు పంచు. నీకే ఓట్లేసి గెలిపిస్తాం..నీ అభిమాన ఓటరు

- న్యూస్‌టుడే, మోత్కూరు


సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?

పోలింగ్‌ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ.. ఓటరుకు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే ఏ వేలికి సిరా గుర్తు వేయాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. మధ్య వేలికి, అదీ లేకపోతే బొటన వేలికి, అసలు ఎడమ చేయే లేకపోతే కుడి చేతి చూపుడు వేలికి, అది లేకపోతే మధ్య వేలికి, ఆ తర్వాత ఉంగరం వేలికి సిరా గుర్తు వేస్తారు. ఒకవేళ ఓటరుకు రెండు చేతులూ లేకపోతే కాలి వేళ్లకు సిరా గుర్తు పూస్తారు.
- న్యూస్‌టుడే, నల్గొండ కలెక్టరేట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని