logo

సమీక్షిస్తూ.. సౌకర్యాలు ఆరా తీస్తూ..!

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోలింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచడానికి నల్గొండ, భువనగిరి అధికార యంత్రాంగాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

Published : 08 May 2024 04:07 IST

లోకసభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేలా యంత్రాంగం చర్యలు
ఈనాడు, నల్గొండ

మ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోలింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచడానికి నల్గొండ, భువనగిరి అధికార యంత్రాంగాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ శాతం  నమోదైనా 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం చాలా చోట్ల 70 శాతమే నమోదు అయింది. ప్రస్తుతం ఇలాంటివి జరగకుండా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే అన్ని సెగ్మెంట్లలో 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు కావడానికి చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో సగటున 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎవరూ బయటకు రావడం లేదు. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో ఉండకుండా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని నల్గొండ, భువనగిరి ఆర్వోలు దాసరి హరిచందన, హనుమంతు కే.జెండగేలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సాధారణ పరిశీలకులు సైతం పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఒకవైపు ఓటు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తూనే యంత్రాంగం తరఫున ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనా పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 2019 ఎన్నికల్లో నల్గొండ లోకసభలో 74.07 శాతం పోలింగ్‌ నమోదు కాగా..భువనగిరిలో 74.39 శాతం పోలింగ్‌ శాతం నమోదయింది. ఈ దఫా దీనిని కనీసం 7 నుంచి 9 శాతం వరకు పెంచేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

కేంద్రాల వారీగా పరిశీలన..

తొలుత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే ఉన్న పోలింగ్‌ సమయాన్ని రాజకీయ పార్టీల వినతితో కేంద్ర ఎన్నికల సంఘం సాయంత్రం 6 వరకు పొడిగించింది. దీంతో ఈ దఫా గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ ఉండటం లేదని అధికారులు భావిస్తున్నారు. ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండలో 86.25 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం అది 68.77 శాతానికే పరిమితమైంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాల వారీగా సౌకర్యాలపై ఆర్వోలు ఆరా తీసి స్వయంగా పరిశీలన చేస్తున్నారు. నల్గొండలో 2060 పోలింగ్‌ కేంద్రాలుండగా..భువనగిరిలో 2141 ఉన్నాయి. వీటిలో సుమారు 15 శాతానికి పైగా మారుమూల ప్రాంతాల్లో ఉండటంతో అందులో ఎండ వేడిమిని నియంత్రించే విధంగా సౌకర్యాలు లేవని గుర్తించారు. దీంతో ప్రతి కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటూ మెడికల్‌ కిట్లు, ఎండ తీవ్రత నుంచి ఉపశమన కలిగించే విధంగా షామియానాలు, మంచినీళ్లు అందుబాటులో ఉంచాలని ఇప్పటికే ఆదేశించారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఎక్కువగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లలో ఉన్న గదుల్లోనే పోలింగ్‌ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్న అధికారులు.. ఒక వేళ మొదటి అంతస్తులో ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. పోలింగ్‌ సిబ్బందికి గది లోపల ఫ్యాన్లు, కూలర్లను సైతం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆర్వో ఆదేశించడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి కేంద్రం పరిస్థితిని స్వయంగా పరిశీలించి తనకు రిపోర్టు ఇవ్వాలని నల్గొండ ఆర్వో దాసరి హరిచందన ఆదేశించడంతో క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బంది సౌకర్యాలపై ఆరా తీసి ఇంకా ఏం సౌకర్యాలు కావాలో ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని