logo

అక్రమమే ముచ్చట అడ్డే లేదిచ్చట!

స్వర్ణాల చెరువుగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు చెరువు విస్తీర్ణం దాదాపు మూడున్నర వేల ఎకరాలు. నీటి నిల్వ సామర్థ్యం 0.70 టీఎంసీలు. దీని పరిధిలో దాదాపుగా 12 వేల ఎకరాల ఆయకట్టు ఉండేది. నెల్లూరు నగరానికి ప్రధాన తాగునీటి వనరుల్లో ఇది ముఖ్యమైనది. అలాంటి చెరువు క్రమేపీ ఆక్రమణలకు గురవుతోంది.

Updated : 08 Aug 2022 04:11 IST

అధికార పార్టీ నాయకుల చెరలో స్వర్ణాల చెరువు
ఏడాది కిందటే నివేదికలిచ్చినా స్పందించని అధికారగణం

ఈ చిత్రంలో కనిపిస్తోంది లేక్‌వ్యూ కాలనీలో స్వర్ణాల చెరువును ఆనుకుని ఉన్న ప్రాంతం. భవన నిర్మాణ వ్యర్థాలతో చదును చేసి ఉన్న ఈ ప్రాంతం మొన్నటివరకు చెరువుగా ఉండేది. స్థానిక నాయకుడు మట్టి పోసి చదును చేయడంతో పాటు.. అమ్మకానికి పెట్టడం విశేషం. అక్కడ ఎలాంటి పట్టా లేకుండా 12 అంకణాల స్థలం రూ.3 లక్షలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇలా ఒకటి.. రెండు కాదు.. ఏకంగా వందల ఎకరాల్లో చెరువును పూడ్చేసి విక్రయిస్తున్నా.. రక్షించాల్సిన రెవెన్యూ, సాగునీటి పారుదలశాఖ అధికారులు మామూళ్ల మత్తో, రాజకీయ ఒత్తిళ్లోగానీ.. అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: స్వర్ణాల చెరువుగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు చెరువు విస్తీర్ణం దాదాపు మూడున్నర వేల ఎకరాలు. నీటి నిల్వ సామర్థ్యం 0.70 టీఎంసీలు. దీని పరిధిలో దాదాపుగా 12 వేల ఎకరాల ఆయకట్టు ఉండేది. నెల్లూరు నగరానికి ప్రధాన తాగునీటి వనరుల్లో ఇది ముఖ్యమైనది. అలాంటి చెరువు క్రమేపీ ఆక్రమణలకు గురవుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు ఏళ్ల తరబడి ఆక్రమించుకోవడంతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. కొందరు చెరువును ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తుండగా.. మరికొందరు భారీస్థాయిలో వ్యవసాయం, రొయ్యలు, చేపల చెరువులు సాగు చేస్తున్నారు. ఏటా ఈ ఆక్రమణల పర్వం పెరుగుతుండటంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుతం అర టీఎంసీ నీటిని కూడా నిల్వ చేసే పరిస్థితి లేదని ఇరిగేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువులో నిర్మించిన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నుంచి నగరంలోని చాలా ప్రాంతాలకు తాగునీరు సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గితే.. భవిష్యత్తులో తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొవాల్సి వస్తోందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

సర్వేతో సరి..
గతేడాది చెరువులో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశించింది. సర్వే చేసి ఆక్రమణలు గుర్తించాలని ఉత్తర్వులిచ్చింది. దాంతో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు మొత్తం తిరిగి నివేదికను సిద్ధం చేశారు. గ్రామీణ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో నేటికీ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. అప్పటికే హడావుడిగా సర్వే పూర్తి చేసిన అధికారులు దాదాపు 1,400 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఆక్రమణల తొలగింపు వ్యవహారాన్ని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ.. మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆక్రమణలు తొలగించే అధికారం రెవెన్యూ శాఖకు ఉంటుందని, తాము సాయం అందిస్తామని ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు చెబుతుండటం విశేషం.
నివేదికను ఉన్నతాధికారులకు ఇచ్చాం - కృష్ణమోహన్‌, ఎస్‌ఈ, ఇరిగేషన్‌
స్వర్ణాల చెరువులో ఆక్రమణ గుర్తించేందుకు గతేడాది సర్వే చేసిన మాట వాస్తవమే. ఆ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అప్పుడే అందించాం. ఆక్రమణలు తొలగించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖది. వారికి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

ప్లాట్లు చేసి.. విక్రయిస్తూ..
అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రస్తుతం స్వర్ణాల చెరువును యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. భవన నిర్మాణ వ్యర్థాలు, గ్రావెల్‌, మట్టి వంటి వాటిని పోసి చెరువును పూడ్చేస్తున్నారు. అనంతరం వాటిని విక్రయిస్తుండటం గమనార్హం. ఎలాంటి పట్టా లేకుండా 12 అంకణాల స్థలం రూ.3 లక్షలకు బేరం పెడుతున్నారు. తక్కువ ధరకు స్థలం దొరికుతుందని కొందరు పేద, మధ్య తరగతి ప్రజలు వాటిని కొనుగోలు చేసి నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై కొందరు స్థానికులు రెవెన్యూ, కార్పొరేషన్‌, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా.. కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పైగా ఆ విషయాన్ని ఆక్రమణదారులకు చెప్పడంతో బెదిరింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఏడాది నుంచి దాదాపు 50 ఎకరాలకు పైగా చెరువును ఆక్రమించి ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


నిర్మిస్తున్న ఇళ్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని