logo

నిగ్గుతేలిన అక్రమాలు

పెరంకొండ అక్రమాల లెక్క తేలింది. ముంపు పరిహారం పేరిట రూ. కోట్లు కాజేసిన వారి చిట్టా బయటకు వచ్చింది. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా కాజేసిన వారితో పాటు.. అందుకు సహకరించిన అధికారుల పాత్ర విచారణలో నిగ్గు తేలింది.

Updated : 04 Jun 2023 04:51 IST

పెరంకొండలో రూ.29.70 కోట్లు స్వాహా చేసినట్లు నిర్ధారణ

కలెక్టర్‌కు చేరిన తుది నివేదిక

పెరంకొండ గ్రామం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు ;-పెరంకొండ అక్రమాల లెక్క తేలింది. ముంపు పరిహారం పేరిట రూ. కోట్లు కాజేసిన వారి చిట్టా బయటకు వచ్చింది. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా కాజేసిన వారితో పాటు.. అందుకు సహకరించిన అధికారుల పాత్ర విచారణలో నిగ్గు తేలింది. దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేసిన జేసీ కూర్మనాథ్‌.. కలెక్టర్‌కు అందించినట్లు సమాచారం. రూ. 29.70 కోట్ల ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసిన వారిపై చర్యలకు మార్గం సుగమమైంది.

అసలేం జరిగిందంటే?

సుమారు 30 ఏళ్ల కిందట కండలేరు జలాశయం నిర్మాణ సమయంలో ప్రభుత్వం 24 గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతో పాటు.. నిర్మాణాలకు పరిహారం చెల్లించింది. దాంతో ఆ గ్రామాలు.. అక్కడి మరో ప్రాంతానికి వెళ్లాయి. పెరంకొండ గ్రామం ముంపునకు గురవుతోందని మళ్లీ ప్రతిపాదనలు పెట్టడంతో.. మూడేళ్ల కిందట రూ. 60 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో అవకతవకలు జరిగాయని.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు అందాయి. స్పందనలో కొందరు అర్జీలు ఇచ్చారు. పెరంకొండ ముంపు గ్రామం కాకపోయినా.. పరిహారం తీసుకున్నారని ఉన్నతాధికారులకు వివరించారు.

జేసీ కూర్మనాథ్‌ పర్యవేక్షణలో..

దాంతో జేసీ కూర్మనాథ్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఫిర్యాదు ఆధారంగా రికార్డులు పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ, సర్వే, రెవెన్యూ అధికారుల బృందాన్ని నియమించారు. రెండున్నర నెలలు విచారణ జరిపి.. సమగ్ర వివరాలు సేకరించారు. పాత భవనాలు, పూరిపాకలకు డబ్బు చెల్లించడంతో పాటు.. ఖాళీ స్థలాల్లో ఇళ్లు ఉన్నట్లు, అప్పటికప్పుడు వేసిన రేకుల షెడ్లకు రూ. లక్షలు ఇచ్చినట్లు తేల్చారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను బట్టి మొత్తం రూ. 26 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. సుమారు రూ. 56 కోట్లు ఇచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. అంటే.. రూ. 29.70 కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి.

11 మంది అధికారుల పాత్ర

ప్రభుత్వ సొమ్ము కాజేసేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రణాళిక రచిస్తే.. అందుకు 11 మంది అధికారులు సహకరించినట్లు తేల్చారు. వారిలో తెలుగుగంగ ప్రాజెక్టు భూసేకరణ విభాగం, ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేసే నలుగురు అధికారులు ఉండగా- ఒకరు ఉద్యోగ విరమణ చేశారు. మిగిలిన ముగ్గురిలో.. ఇద్దరు ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నట్లు తెలిసింది. మరో నలుగురు తహసీల్దార్లు, రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలిసింది. ఈ కుంభకోణంలో భాగస్వాములైన అధికారులు.. ప్రస్తుతం జిల్లాలోని వివిధ మండలాల్లో పని చేస్తున్నారు. వీరంతా పథకం ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. క్రిమినల్‌ కేసులు పెట్టే అవకాశం ఉండటంతో సదరు అధికారులు వణికిపోతున్నారు. కొందరు తమను కాపాడండి అంటూ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటున్నారు.

*దీనిపై జేసీ కూర్మనాథ్‌ వివరణ కోరగా.. విచారణ పూర్తయిందన్నారు. తుది నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని, అనంతరం తప్పు చేసిన వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సారైనా చర్యలు తీసుకునేనా?

జిల్లాలో పనిచేస్తున్న కొందరు అధికారులు తప్పు చేయడం.. ఆ తర్వాత ప్రజాప్రతినిధులను పట్టుకుని మళ్లీ పోస్టింగ్‌లు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. చౌటపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు పరిధిలో అటవీ భూములకు ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రికార్డులు సృష్టించి.. రూ. 1.43 కోట్లు పరిహారం పొందారు. దానిపై ఆర్డీవో విచారణ జరిపి.. నిజమని తేల్చడంతో పాటు క్రిమినల్‌ కేసు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. సస్పెండ్‌ అయిన తహసీల్దారుల్లో ఒకరు అదే స్థానంలో పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. వీరికి జిల్లాలోని ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నట్లు సమాచారం. దాంతో మిగిలిన వారిపైనా విచారణ సాగుతూనే ఉంది. అక్రమం జరిగిందని, ఉన్నతాధికారులు తేల్చిన విషయాల్లో చర్యలు తీసుకోవడంలో ఉదాసీనతపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటే.. భవిష్యత్తులో ఈ తరహా అక్రమాలు పునరావృతం కావని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని