logo

టిడ్కో ఇళ్లు.. కదిపితే కన్నీళ్లు!

పేదల సంక్షేమం కోసం అయిదేళ్లలో రూ. కోట్లు ఖర్చు చేశామని పదేపదే చెబుతున్న వైకాపా పెద్దలకు.. టిడ్కో ఇళ్లు కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు అసలు పట్టించుకోనే లేదు.

Updated : 20 Mar 2024 06:44 IST

నిర్మాణాలు పూర్తికాకుండానే తాళాల అప్పగింత
మౌలిక సదుపాయాలు కల్పించకుండానే హడావుడి

ఈనాడు, నెల్లూరు: కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

పేదల సంక్షేమం కోసం అయిదేళ్లలో రూ. కోట్లు ఖర్చు చేశామని పదేపదే చెబుతున్న వైకాపా పెద్దలకు.. టిడ్కో ఇళ్లు కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు అసలు పట్టించుకోనే లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇళ్లు పూర్తికాకుండానే గృహ ప్ర‘వేషాల’ పేరుతో హడావుడి చేశారు. వేలాది మందికి గృహయోగం కల్పించామని ప్రగల్భాలు పలికారు. ఒకరిద్దరికే తాళాలు అప్పగించడంతో లబ్ధిదారులు ఆందోళన చేశారు. దిగొచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు విడతల వారీగా తాళాలు అందజేసినా.. ప్రస్తుతం వాటిలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో తాళాలు తీసుకున్న వారిలో ఒక్కరూ అక్కడ ఉండటం లేదు.

నెల్లూరు నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 41,696 ఇళ్లను తెదేపా ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్రం ఇచ్చే రూ. 1.50 లక్షలకు.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు కలిపి రాయితీగా అందించి.. మిగిలిన సొమ్మును బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకునేలా పథకం రూపొందించారు. 2017 నుంచి 2019 వరకు మూడు విడతల్లో ఇళ్లను జీ+3 విధానంలో నిర్మాణాలు ప్రారంభించి కొన్ని పూర్తి చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక.. మొదటి మూడేళ్లలో టిడ్కో ఇళ్ల ఊసే ఎత్తలేదు. అడపా దడపా ఇస్తున్నవీ.. అరకొర వసతులతోనే అప్పగించారు. కొన్నిచోట్ల తాగునీరు, విద్యుత్తు, మురుగు కాలువలు వంటివి పూర్తిస్థాయిలో కల్పించలేదు.

కనెక్షన్లు ఇవ్వని పైపులు

వేధిస్తున్న అసౌకర్యాలు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైకాపా ప్రభుత్వం హడావుడిగా టిడ్కో ఇళ్ల పంపిణీకి తెరదీసింది. ఫిబ్రవరి 14వ తేదీ వేలాది మందికి తాళాలు అందించేందుకు భారీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, కొండ్లపూడి, కల్లూరుపల్లి, ఇరుకళల పరమేశ్వరీ అమ్మవారి ఆలయం దగ్గర్లో నిర్మిస్తున్న సుమారు 22,512 ఇళ్లలో.. 15,552 పూర్తి చేశామని, వాటికి సంబంధించిన లబ్ధిదారులను అల్లీపురం దగ్గరకు పిలిచి హడావుడి చేశారు. ఇది జరిగి నెల రోజులైనా ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇళ్లను అప్పగించలేదు. తాగునీరు, మురుగునీరు, విద్యుత్తు వంటి కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో తాళాలు తీసుకున్న వారిలో నేటికీ ఒక్కరంటే ఒక్కరు చేరకపోవడం గమనార్హం. సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తుంటే.. చివరకు ఇస్తామని అన్నీ చేసినట్లు చెబుతూ మోసగిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై టిడ్కో అధికారులను వివరణ కోరగా.. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తున్నామని తెలిపారు. పనులు జరుగుతున్నాయని, త్వరలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

నిర్మాణ దశలో రక్షిత మంచినీటి పథకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని