logo

మంచి పేరున.. ముంచిన జగన్‌

తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు.

Published : 06 May 2024 05:48 IST

పథకాల లబ్ధి అందని వైనం
అంగన్‌వాడీ సిబ్బంది ఆవేదన

వంటావార్పుతో అంగన్‌వాడీల నిరసన (పాతచిత్రం)

తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు. 2019 ఎన్నికల సమయంలో తెలంగాణలో కంటే రూ. వెయ్యి అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాదిలో మాత్రమే రూ. వెయ్యి పెంచి చేతులు దులుపుకొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ. 13,500 ఇస్తున్నారు.

‘మీ అన్నొస్తాడు... మీకు మంచే చేస్తాడు’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలకు సీఎం జగన్‌ గతంలో భరోసా ఇచ్చారు. ఆపై వారిని నిండా ముంచారు. జీతభత్యాలు మెరుగ్గా ఉన్నాయంటూ అప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాల వర్తింపును నిలిపేశారు. ఎన్నికలకు ముందు మంచి చేస్తానని చెప్పి... ఏరు దాటాక ముంచేశారంటూ అంగన్‌వాడీ సిబ్బంది  ఆగ్రహం చెందుతున్నారు.

దుత్తలూరు, న్యూస్‌టుడే: జిల్లాలో 12 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 2,934 అంగన్‌వాడీ, 229 మినీ కేంద్రాలు ఉన్నాయి. 2,673 మంది కార్యకర్తలతోపాటు 2,665 మంది సహాయకులు (ఆయాలు) పనిచేస్తున్నారు. మినీ కేంద్రాల్లో 226 మంది విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కంటే రూ. వెయ్యి అదనంగా వేతనం పెంచటమే కాదు... సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ 2019 ఎన్నికలకు ముందు అంగన్‌వాడీ సిబ్బందికి జగన్‌ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్య పరిష్కరించలేదు. రకరకాల యాప్‌లు, సర్వేల పేరుతో అదనపు పనిభారం మోపారు. నాలుగున్నరేళ్లు ఓపికగా ఎదురుచూసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విధిలేక సమ్మె బాట పట్టారు. అయినా ప్రభుత్వం ఎస్మా, ఉద్యోగాల తొలగింపు తదితర అస్త్రాలతో బెదిరించి విధుల్లో చేరేలా చేసిందే తప్ప చిరుద్యోగులైన వారి సమస్య ఒక్కటైనా తీర్చుదామన్నా ప్రయత్నం చేయలేదు.

  • గత అయిదేళ్లలో టీఏ, డీఏలు, కూరగాయలు, నిత్యావసర సరకులకు సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. గ్యాస్‌, నిత్యావసర వస్తువులకు సంబంధించి అంగన్‌వాడీలు సొంత డబ్బులే చెల్లించే పరిస్థితి నెలకొంది. ఎప్పటి నుంచో డిమాండు చేస్తున్న వేతన పెంపు, గ్రాట్యుటీ, మినీ కేంద్రాల సిబ్బందిని ప్రధాన కార్యకర్తలుగా గుర్తింపు, ఆయాలకు అంగన్‌వాడీలుగా పదోన్నతి, ఉద్యోగ విరమణ వయసు పెంపు, కేంద్రాల అద్దె బకాయిలు సకాలంలో చెల్లింపులు... ఇలా ఏ ఒక్కటీ కూడా పరిష్కారానికి నోచుకోలేదని వారు వాపోతున్నారు. తెదేపా హయాంలో అన్నీ పథకాలు వర్తిస్తుండగా జగన్‌ పాలనలో అంగన్‌వాడీలను అమ్మఒడి, విద్యా, వసతి దీవెనలు, ఒంటరి, వితంతు, దివ్యాంగులకు సామాజిక పింఛన్లు తదితర పథకాలకు అనర్హులను చేసింది.
  • పదకొండు డిమాండ్లతో అంగన్‌వాడీ సిబ్బంది గత ఏడాది డిసెంబరు 12 నుంచి జనవరి 22 వరకు అంగన్‌వాడీలు నిరవధిక సమ్మె చేస్తే ప్రభుత్వ చర్చల్లో భాగంగా సమ్మె కాలానికి వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది.

పనికి తగ్గ వేతనం లేదు
ఓ అంగన్‌వాడీ కార్యకర్త

ప్రభుత్వం పనిభారం మోపుతుందే తప్ప దానికి తగ్గట్లుగా వేతనం ఇవ్వటంలేదు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క సమస్య పరిష్కరించిన దాఖలాల్లేవు. దీనికితోడు కార్యకర్తలు, ఆయాలకు నెలనెలా సక్రమంగా జీతాలు అందకపోతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. నిత్యావసర సరకుల బిల్లులు సకాలంలో మంజూరు చేయకపోవడంతో అప్పులు చేసి చిన్నారులకు వడ్డించాల్సి వస్తోంది. తెలంగాణలో ఇచ్చే గౌరవ వేతనాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని