logo

ఉద్యోగుల ఓట్లకు వైకాపా బేరసారాలు

ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు అధికార వైకాపా బేరసారాలు సాగిస్తోంది. తమ విధానాలపై గుర్రుగా ఉన్న ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది.

Published : 07 May 2024 04:13 IST

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు అధికార వైకాపా బేరసారాలు సాగిస్తోంది. తమ విధానాలపై గుర్రుగా ఉన్న ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 19,834 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉండగా- వాటి వినియోగంలో గందరగోళానికి గురవుతున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి బ్యాలెట్‌ విడుదల కాలేదు. ఈ క్రమంలో మొత్తం 19,834 ఓట్లకు.. ఆది, సోమవారాల్లో 14,541 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతర జిల్లాల ఓటర్లు 2,548 ఉండగా- 1,374 మంది ఓటు వేశారు. సోమవారం కావలి జడ్పీ హైస్కూల్‌లో ఓటింగ్‌ ప్రక్రియ గంట ఆలస్యంగా ప్రారంభమవగా- ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ఈ కేంద్రం వద్దనే.. కొందరు నాయకులు డబ్బు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. వెంకటాచలం క్యూబా ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద తెదేపా ఏజెంట్‌ను పోలీసులు బయటకు పంపడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.            

అధికార పార్టీ ఆపసోపాలు

కందుకూరు, నెల్లూరు గ్రామీణం, ఆత్మకూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో ఒక్కో పోస్టల్‌ బ్యాలెట్‌కు అధికార పార్టీ నాయకులు రూ.అయిదు వేలు ఇవ్వడంతో పాటు.. ఓటు వేసేందుకు కార్లు కూడా సమకూర్చినట్లు సమాచారం. ఆ క్రమంలో కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆ మొత్తాలను తిరస్కరించినట్లు తెలిసింది. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది ఉపాధ్యాయులు ఉండటం.. సీపీఎస్‌ ఆందోళన నేపథ్యంలో వారిపై వైకాపా ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తదితరాలతో తమకు అనుకూలంగా ఉండరనే నెపంతో గందరగోళానికి, ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకే ఓటు వేసినట్లు చరవాణిలో ఫొటోలు తీసి తమకు పంపాలని కొన్ని సంఘాల నాయకులు ఉద్యోగులను కోరారన్న సమాచారం వివాదాస్పదమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని