logo

మరమ్మతుల మాటేమిటి?

వర్షాకాలం త్వరలో ఆరంభం కానుంది. ఆలోపు లోతట్టు ప్రాంతాలు, వరదనీటి కాల్వల మరమ్మతులు చేపట్టాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో వరద కాల్వలను నిర్మించారు.

Published : 23 May 2024 02:24 IST

కాల్వలు ధ్వంసం.. వరదొస్తే నష్టం
ఏటా సమస్య పునరావృతం
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

‘జిల్లా కేంద్రంలోని వాసవీనగర్‌లో వరద కాల్వ కూలిపోయింది. గతేడాది కురిసిన వర్షాలకు వరద ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో స్థానికంగా వాన నీరు ఉప్పొంగింది. అయినా ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు.’ 


ర్షాకాలం త్వరలో ఆరంభం కానుంది. ఆలోపు లోతట్టు ప్రాంతాలు, వరదనీటి కాల్వల మరమ్మతులు చేపట్టాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. అప్పటి జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో వరద కాల్వలను నిర్మించారు. ఈ కాల్వల పనులు ప్రజారోగ్యశాఖ పర్యవేక్షించింది. ఆ తర్వాత పురపాలికకు అప్పగించారు. పట్టణంలో తాజా పరిస్థితిపై ఇప్పటివరకు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

పరిస్థితి ఇదీ..

జిల్లా కేంద్రంలో లోతు తక్కువ తీసి వరద నీటి కాల్వలు ఏర్పాటు చేయడంతో వాన నీటితో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనల మేరకు 3-4 మీటర్ల లోతు పూడిక తీసి నిర్మాణాలు చేపట్టాలి. అందుకు భిన్నంగా 2 మీటర్ల లోతు తీసి సీసీతో దిమ్మెలు   నిర్మించారు. వరద ఉద్ధృతికి ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. నాలుగైదేళ్లకు ఓసారి మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా చర్యలు కరవయ్యాయి.


‘కామారెడ్డి ఉపాధ్యాయకాలనీలో వరద నీటి కాల్వ ధ్వంసమైంది. ఈ కాలనీ నుంచి గాంధీనగర్‌ మీదుగా వాసవీనగర్, సిరిసిల్లరోడ్డు ప్రాంతాల నుంచి సమీప నాలాలోకి వరద వెళ్తుంది. రెండేళ్ల క్రితం మరమ్మతులు చేపట్టారు. గతేడాది కురిసిన వర్షానికి కాల్వ కొట్టుకుపోయింది.’


ఎక్కడెక్కడంటే..

జిల్లా కేంద్రంలోని కొత్త పట్టణంలో అశోక్‌నగర్, స్నేహపురికాలనీ, రుక్మిణికుంట, పంచముఖి హనుమాన్‌కాలనీ, బతుకమ్మకుంట, ఉపాధ్యాయకాలనీ, గాంధీనగర్, వాసవీనగర్‌ మీదుగా సిరిసిల్లరోడ్డులోని నాలాకు వరద వెళ్తుంది. మరో మార్గంలో జన్మభూమి రోడ్డు, చెరువు ప్రాంతం మీదుగా వరద హౌసింగ్‌బోర్డు కాలనీలోని నాలాలో కలుస్తుంది. పట్టణంలో 11 కి.మీ మేర 16.85 కోట్లతో చేపట్టిన కాల్వలు అక్కడక్కడ ధ్వంసమై ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఇప్పుడు దృష్టిపెడితేనే..

పురపాలక యంత్రాంగం వరద కాల్వలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పక్షం రోజుల్లో మరమ్మతు పనులు చేపట్టాలి. వార్డుల్లో ఇంజినీరింగ్‌ విభాగ అధికారులు సర్వే చేపట్టాలి. ప్రత్యేక నిధుల కోసం సర్కారుకు నివేదించాలని పురవాసులు కోరుతున్నారు. కాగా వానాకాలంలో తలెత్తే ఇబ్బందులపై అప్రమత్తంగా ఉంటామని పురపాలక కమిషనర్‌ సుజాత ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సర్వే చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని