logo

బడి బాగుకు నడుంబిగింపు

బడుల దశ మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.7289 కోట్లు కేటాయించింది. సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అధ్యయనం అనంతరం వారిచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు లేక ఇబ్బందులెదురవుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో...

Published : 18 Jan 2022 03:31 IST

ఫీ‘జులుం’కు ముకుతాడు
అంతా ఆంగ్లమయం
మంత్రివర్గ ఉపసంఘంపైనే ఆశలు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం

కామారెడ్డి జిల్లాకేంద్రంలోని తిలక్‌రోడ్డు ప్రభుత్వ పాఠశాలలో బల్లల దుస్థితి

డుల దశ మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.7289 కోట్లు కేటాయించింది. సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అధ్యయనం అనంతరం వారిచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు లేక ఇబ్బందులెదురవుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా íÆ‘ˆజులుం’ కొనసాగుతోంది. ఆంగ్ల మాధ్యమం కోసం వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు విద్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా సర్కారు తీసుకున్న నిర్ణయాలు కార్యరూపం దాల్చితే పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతోంది.

కామారెడ్డిలోని గోదాంరోడ్డులోని ఓ ప్రాథమిక బడిలో వంట గది లేక ఇబ్బందులు

కుంటు‘బడి’
ఉమ్మడి జిల్లాలో 2,245 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా బోధన కుంటుబడింది. దీనికి తోడు వసతుల లేమి వేధిస్తోంది. అనేక తరగతి గదులు వినియోగంలో లేక శిథిల దశకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రహరీలు, తాగునీటి వసతి లేకపోవడం, తలుపులు, కిటికీలు, బల్లలు విరిగిపోవడంతో చదువులెలా కొనసాగించాలో ప్రశ్నార్థకమైంది. ఏళ్లుగా విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతున్నా నిధుల విడుదలలో నిర్లక్ష్యం ఆవరించింది. మధ్యాహ్న భోజన నిర్వహణ నామమాత్రంగా మారింది. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక సమస్య ఎదురవుతోంది. ఉమ్మడి జిల్లాలో 1,41,643 బల్లలు లేక పిల్లలు కింద కూర్చునే పాఠాలు వింటున్నారు. ఇటీవల పాఠశాలల్లో మౌలిక వసతులపై పంపిన నివేదిక ఆధారంగా నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో ఆశలు నెలకొన్నాయి.  

చదువు‘కొనే’ పరిస్థితి లేకుండా..
ఉమ్మడి జిల్లాలో పేద, మధ్యతరగతి వర్గాలు ఒకరిని చూసి మరొకరు ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్పిస్తున్నారు. అందులో ఎల్‌కేజీకి రూ.15 వేల- 20 వేలు, ఒకటో తరగతికి రూ.20 వేల- 28 వేలు వసూలు చేస్తున్నారు. స్థాయి లేేకున్నా పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో రుసుముల సంగతి చెప్పక్కర్లేదు. కొవిడ్‌ వేళ ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపారు. తాజాగా రుసుముల నియంత్రణపై సర్కారు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహం
ఉమ్మడి జిల్లాలో 562 బడుల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతోంది. నేటి పోటీ ప్రపంచంలో తెలుగు చదవలంటే తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత స్థాయిలో కొన్ని బడులకే ఆంగ్ల మాధ్యమం అనుమతించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ బడుల్లో ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత నిర్ణయాలతో ప్రభుత్వ బడుల దశ- దిశ మారే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని