logo

విజయ ప్రతిజ్ఞ

ఎందరో విద్యావంతులను లక్ష్యం వైపు నడిపిస్తున్నారు.. మరెందరో నిరుపేద విద్యార్థులను విజయ తీరాలకు చేర్చుతున్నారు..

Updated : 27 Nov 2022 06:23 IST

పేదరికం నుంచి కలల కొలువుకు
గ్రూప్స్‌ శిక్షకురాలిగా ఎందరికో తోడ్పాటు

న్యూస్‌టుడే, భిక్కనూరు: ఎందరో విద్యావంతులను లక్ష్యం వైపు నడిపిస్తున్నారు.. మరెందరో నిరుపేద విద్యార్థులను విజయ తీరాలకు చేర్చుతున్నారు.. ఇంకెందరో కలలను సాకారం చేస్తున్నారు... ఆమే తెవివి దక్షిణ ప్రాంగణం జియోఇన్ఫర్మేటిక్స్‌ విభాగం సహాయ ఆచార్యురాలు డా.తాటికొండ ప్రతిజ్ఞ. ఇటీవల పీహెచ్‌డీ గైడ్‌గా అర్హత సాధించడంతో పాటు ప్రతిష్ఠాత్మకమైన మైనర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం కాంపిటీటివ్‌ సెల్‌ కోఆర్డినేటర్‌గా గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న వారికి శిక్షణ అందిస్తున్నారు. కటిక పేదరికం నుంచి ఈ స్థాయికి ఎదిగిన తీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

చిన్నప్పుడే అమ్మకు సాయంగా..:  మాది నిర్మల్‌ జిల్లా భైంసా. నాన్న ప్రకాశ్‌.. కిరాణ దుకాణంలో పని చేసేవారు. ఆయన సంపాదనతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో అమ్మ విజయమాల ఇంట్లోనే పిండి వంటలు తయారు చేసి విక్రయించేవారు. అందుకే చిన్ననాటి నుంచే కష్టం, డబ్బు విలువ తెలుసుకోగలిగాను. ఎంత పేదరికం ఉన్నా చదువు ఆపకూడదని ‘ప్రతిజ్ఞ’ చేసుకున్నా. స్థానికంగా ఉన్న శిశుమందిర్‌లో పదో తరగతి పూర్తి చేశాను. అక్కడే ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివాను. డిగ్రీకి నిజామాబాద్‌కు వచ్చా. ఖర్చులకు ఇంట్లో నుంచి డబ్బులు పంపే స్తోమత లేకపోవడంతో ట్యూషన్లు చెప్పా. ఆంగ్ల భాష నేర్చుకోవడానికి వార్తా పత్రికలు చదవాలనుకున్నా.. రోజూ కొనడానికి డబ్బులు లేకపోవడంతో దొరికిన పత్రికనే పదేపదే చదివేదాన్ని. 

శాస్త్రీయ సంగీతం: చిన్నప్పటి నుంచే చదువుతో పాటు సంగీతం అంటే అమితమైన మక్కువ ఉండేది. ఉదయం నాలుగు గంటలకే లేచి హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నా. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ‘ఈటీవీ’లో ప్రసారమైన ‘పాడాలని ఉంది’లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తాు. గాతారహే మేరా దిల్‌్ వంటి కార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నా.

బోధన.. శిక్షణ.. పరిశోధన: 2013లో సహాయ ఆచార్యురాలిగా దక్షిణ ప్రాంగణంలోని జియో ఇన్ఫర్మేటిక్స్‌ విభాగంలో చేరినప్పటి నుంచి బోధన, పోటీ పరీక్షార్థులకు శిక్షణ కొనసాగిస్తున్నా. ఇటీవల పరిశోధన కూడా ప్రారంభించాను. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం వల్ల ప్రజలకు సామాజికంగా, ఆర్థికంగా చేకూరిన లబ్ధి అనే అంశంపై పరిశోధన చేస్తున్నా. విద్యార్థుల శిక్షణార్థం ఏర్పాటు చేసిన కాంపిటీటివ్‌ సెల్‌ విభాగానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నా. ఇప్పటి వరకు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఎంతో సంతృప్తినిస్తోంది

ఉస్మానియా భవిష్యత్తును మార్చింది

పీజీ ప్రవేశ పరీక్ష రాసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాగ్రఫీ సీటు సాధించడం జీవితాన్నే మార్చేసింది. అక్కడి వాతావరణం, అధ్యాపకుల బోధనతో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచా. ఓ వైపు పీజీ చదువుతూనే సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధమయ్యా. ఖర్చులకు ట్యూషన్లు కొనసాగించా. పీజీ రెండో సంవత్సరంలోనే నెట్‌ అర్హత సాధించా. రెండు నెలలపాటు ఓ యజ్ఞంలా చదివి గ్రూప్‌-2 పరీక్ష రాయడంతో సీనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగం వరించింది.

పుస్తకాల రచన..

ప్రతిమా పబ్లికేషన్స్‌ ద్వారా గ్రూప్‌-2కు సన్నద్ధమయ్యే వారికి సులభంగా అర్థమయ్యేలా వాడుక భాషలో ఇండియన్‌ ఎకానమీ పుస్తకం రాశాను. అనేక మంది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైంది. తెలుగు అకాడమీ ద్వారా విడుదల చేసిన సుమారు 12 జాగ్రఫీ పుస్తకాల రచనల్లోనూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని