logo

ఇంటి వద్దే ఓటు

లోక్‌సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.

Updated : 29 Mar 2024 06:13 IST

దివ్యాంగులు, 85 ఏళ్లు  నిండిన వృద్ధులకు అవకాశం

నిజామాబాద్‌ అర్బన్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పెట్టెలో ఓటేస్తున్న వృద్ధురాలు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌, నిజామాబాద్‌ కలెక్టరేట్‌: లోక్‌సభ ఎన్నికల్లోనూ దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో మొత్తంగా 6,78,380మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 80 నుంచి 89 ఏళ్లు దాటిన వారు 7,733 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 85 ఏళ్లకు పైబడిన 3,866 మందికి ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఇక జిల్లాలో 16,494 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. వీరు పోలింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందుగానే రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో ఓటు వేయనున్నారు.

ఫారం 12-డీ దరఖాస్తులు

ఇంటి వద్ద ఓటు వేసే వారిని బూత్‌స్థాయి అధికారులు ముందుగానే గుర్తించి ఇంటికి వెళ్లి ఫారం 12-డీని దరఖాస్తు అందజేస్తారు. ఈ పత్రాన్ని ఓటర్లు పూరించి తిరిగి బీఎల్‌వోలకు ఇస్తే వాటిని ఆర్వోలకు చేరవేస్తారు. ఈ దరఖాస్తుల ఆధారంగా వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బ్యాలెట్‌ పంపిస్తారు. ఇందులో ఎవరైనా నేను పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేస్తానని చెబితే దరఖాస్తు పత్రాలు ఇవ్వరు. వీరికోసం కేంద్రంలో ర్యాం పులు, చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచనున్నారు.


రహస్య పద్ధతిలో..

ఎన్నికలకు ఒక రోజు ముందే సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటికి మొబైల్‌ వ్యాన్‌లో చేరుకుంటారు. ఇందులో ఇద్దరు పోలింగ్‌ అధికారులు, ఓ వీడియోగ్రాఫర్‌, మరో రక్షణ అధికారి ఉంటారు. ఇక్కడ ఓటరుకు బ్యాలెట్‌ పత్రం అందజేస్తారు. అధికారులు నిర్దేశించిన కంపార్ట్‌మెంటులో ఓటరు రహస్యంగా హక్కు వినియోగించుకొని బ్యాలెట్‌ బాక్సులో వేస్తారు. ఈ ప్రక్రియను అధికారులు పూర్తిగా చిత్రీకరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని