logo

రాష్ట్రంలో చివరి స్థానం

కామారెడ్డి జిల్లాలో ఇంటర్‌ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది.

Published : 25 Apr 2024 03:41 IST

నిరాశాజనకంగా ఇంటర్‌ ఫలితాలు
ప్రథమంలో 34.81, ద్వితీయంలో 44.29 శాతం ఉత్తీర్ణత

ఈనాడు, కామారెడ్డి, కామారెడ్డి విద్యావిభాగం, న్యూస్‌టుడే: కామారెడ్డి జిల్లాలో ఇంటర్‌ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 34.81 శాతం, ద్వితీయ సంవత్సరంలో 44.29 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతంలో కొవిడ్‌ కారణంగా 70 శాతం ప్రణాళికతో పరీక్షలు జరిగాయి. గతేడాది నుంచి వందశాతం పాఠ్యప్రణాళికతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడంతో ఉత్తీర్ణత శాతం కొంత మెరుగైంది. ఐదేళ్లలో 50 నుంచి 68 శాతం నమోదు కాగా ఈ ఏడాది ఫలితాలు ఊహించని విధంగా కంగుతినిపించాయి.

అమ్మాయిలదే పైచేయి

ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో విద్యార్థినులు 44.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 38.73 శాతం ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు 5.45 శాతం అధికంగా ఫలితాలు నమోదు చేశారు. రెండో సంవత్సరంలో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 53.9 శాతం కాగా అబ్బాయిలు 34.21 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు.    

వృత్తివిద్యా కోర్సుల్లో..

వృత్తివిద్యా కోర్సు(వొకేషనల్‌) ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా 28వ స్థానంలో నిలిచింది. 86 విద్యార్థులకు గాను 29 మంది (33.72 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 26వ స్థానంలో నిలవగా 46.67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం విద్యార్థులు 1502 మందికిగాను 701 మంది ఉత్తీర్ణులయ్యారు.

పర్యవేక్షణ లోపమే కారణం

కొవిడ్‌ తర్వాత 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో ఉత్తీర్ణత 59 శాతం, 2022-23లో 67 శాతం నమోదు కాగా.. ఈ ఏడాది మాత్రం 44.29 శాతానికే పరిమితమైంది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణపై యంత్రాంగం పర్యవేక్షణ కొరవడింది. మండలాల్లోని జూనియర్‌ కళాశాలల్లో ఫలితాలు రాబట్టేందుకు అధికారుల కసరత్తు అంతంతమాత్రంగానే చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రస్థాయిలో చిట్టచివరి స్థానంలో కామారెడ్డి జిల్లా నిలవడం ఫలితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. కాగా జిల్లాలో ఆయా చోట్ల మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన చోట్ల పర్యవేక్షకులు కఠినంగా వ్యవహరించారు. సదాశివనగర్‌ మండలంలో నలుగురు అధ్యాపకులు సస్పెన్షన్‌కు గురయ్యారు. దీంతో అన్ని కేంద్రాల్లో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. దీంతో విద్యార్థులు కొంత మేర భయంభయంగా పరీక్షలు రాయడం.. ఆ ప్రభావం ఫలితాలపై పడింది.

అనుత్తీర్ణులు నిరాశ చెందొద్దు

షేక్‌ సలాం, ఇంటర్‌ నోడల్‌ జిల్లా అధికారి

ఇంటర్‌ ఫలితాల్లో అనుత్తీర్ణులైన వారు నిరాశచెందొద్దు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. త్వరలో నిర్వహించే అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసి మెరుగైన ఫలితాలు సాధించాలి. గతంలో కన్నా ఈ సారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు తగ్గాయి. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లా ఆఖరు స్థానంలో నిలవడం బాధాకరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని