logo

ఇందూరు భగభగ

ఇందూరులో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. మే ఆరంభంలోనే ఎండ ప్రచండమైంది. జిల్లాలో మూడు ప్రాంతాలు రెడ్‌ జోన్‌లోకి వెళ్లాయి.

Published : 05 May 2024 06:25 IST

జాకోరాలో 46.4 డిగ్రీలు నమోదు

రానున్న రెండురోజుల్లో ఇదే పరిస్థితి

 న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం: ఇందూరులో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. మే ఆరంభంలోనే ఎండ ప్రచండమైంది. జిల్లాలో మూడు ప్రాంతాలు రెడ్‌ జోన్‌లోకి వెళ్లాయి. సగానికి పైగా మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయి. శనివారం ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయి నమోదైంది. అత్యధికంగా వర్ని మండలం జాకోరాలో 46.4, నిజామాబాద్‌ ఉత్తరంలో 45.6, వేంపల్లిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 2002 మే 22న 47.3 డిగ్రీలు ఆల్‌టైం రికార్డుగా ఉంది. ఇప్పుడు ఆ దరిదాపుల్లోకి వెళ్లింది. మరో రెండు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 5, 6 వరకు సైతం ఎక్కువగానే నమోదయ్యే వీలుందని చెబుతున్నారు. ఆ తర్వాత ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకాల వర్షం వచ్చే వీలుందని ముందస్తు సూచనలో వెల్లడించింది.

27 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో..

శనివారం నిజామాబాద్‌ నగరంతో పాటు వర్ని, ముప్కాల్‌ మండలాలు రెడ్‌జోన్‌లో, 27 మండలాలు ఆరెంజ్‌జోన్‌లో ఉన్నాయి. నందిపేట్‌, ఆలూర్‌, డొంకేశ్వర్‌, ఇందల్‌వాయి, సిరికొండ, ధర్పల్లి, కొంత భాగం మాక్లూర్‌, డిచ్‌పల్లి మండలాలు ఎల్లో అలెర్ట్‌లో ఉన్నాయి. ఈ ప్రాంతాలను మినహాయిస్తే మిగతా ప్రాంతమంతా ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్లింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 35-40 డిగ్రీలుంటే ఎల్లో అలెర్ట్‌గా, 40-45 డిగ్రీల వరకు ఆరెంజ్‌ అలెర్ట్‌గా పరిగణిస్తారు. కానీ, ఇప్పుడు 45 డిగ్రీలు 27 మండలాల్లో దాటింది. దీనిని రెడ్‌జోన్‌గా భావిస్తారు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరైతే గాని బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా 46 డిగ్రీలు దాటడంతో ఇందూరు అట్టుడికిపోతోంది. చెరువులు, బావుల్లో నీరింకిపోతోంది. వన్యప్రాణులు తల్లడిల్లుతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటినా భానుడు శాంతించడం లేదు.


40 డిగ్రీలు సాధారణం
- ప్రతాప్‌, జిల్లా వాతావరణశాఖ అధికారి

ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 25 వరకు 40 డిగ్రీల సెల్సియస్‌ అనేది సాధారణంగా ఉంటుంది. మరో రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మేఘావృతమయ్యే వీలుంది. జూన్‌ రెండో వారం వరకు జిల్లాలోకి నైరుతి వస్తుంది. అప్పటి వరకు రక్షణ చర్యలు తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని