logo

ఇటు తనిఖీలు.. అటు దోస్త్‌ నోటిఫికేషన్‌

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

Published : 07 May 2024 06:08 IST

న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. సౌకర్యాలు లేని కళాశాలల్లో వాటి కల్పన కోసం నెల రోజుల గడువు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదల కావడం గమనార్హం. యూజీసీ, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ నిబంధనలకు లోబడిన కళాశాలలకే ‘వర్సిటీ అఫిలియేషన్‌’ ఇస్తామని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు నిబంధనలు, ప్రమాణాలు పాటించిన వాటికి మాత్రమే ‘దోస్త్‌’లో ప్రవేశాలకు అనుమతి ఇస్తామన్నారు. అయితే ఇటు కళాశాలల తనిఖీలు జరుగుతుండగానే.. అటు డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. వర్సిటీ పరిధిలో 54 ప్రైవేటు డిగ్రీ కళాశాలలుండగా.. దాదాపు 30 కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేవని తనిఖీల్లో తేలినట్లు ఓ అధికారి చెప్పడం గమనార్హం. ఏటా తనిఖీలు నిర్వహించడం, సౌకర్యాలు కల్పించాలని సూచించడం పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాల్లో డిగ్రీ అడ్మిషన్లు పూర్తయ్యాక తనిఖీలు నిర్వహించిన పరిస్థితులున్నాయి. ప్రైవేటు వారు ప్రవేశాలపై చూపిన శ్రద్ధ, కనీస సౌకర్యాల కల్పన, విద్యార్థులకు బోధన అందించడంలో చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కొన్ని కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల్లో నడుస్తూ ప్రముఖ కళాశాలలుగా చలామణి అవుతుండడం కొసమెరుపు. నగరంలోని ఓ ప్రముఖ ప్రైవేటు కళాశాల ఇబ్బడి ముబ్బడిగా కొత్త కోర్సులు తెచ్చుకుంటుంది. కానీ సరిపడా తరగతి గదులు, ల్యాబ్‌లు ఉన్నాయా.? అని ఆలోచించడం లేదు. ప్రైవేటు కళాశాలలు అడిగిందే తడవుగా ఉన్నత విద్యా మండలి కొత్త కోర్సులు, సెక్షన్లను ఇస్తోందని విద్యావేత్తలు వాపోతున్నారు. అనుబంధ గుర్తింపు తనిఖీలు పూర్తయిన తర్వాతే ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యామండలి ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు ఇవ్వడంతో యూనివర్సిటీ పాత్ర నామమాత్రంగా మారుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని