logo

ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు

పీఎం కుసుమ్‌ పథకం కింద జిల్లాలో సౌర యూనిట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

Published : 09 May 2024 02:58 IST

జిల్లాలో ఎనిమిది ఎంపిక

రాజంపేట వద్ద ఏర్పాటు చేసిన సౌర పలకలు

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పీఎం కుసుమ్‌ పథకం కింద జిల్లాలో సౌర యూనిట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం విద్యుత్తు ఉపకేంద్రాల్లో వాటిని నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. స్థలం అనుకూలంగా ఉన్న ఉపకేంద్రాల్లో ఈ ప్రక్రియ ద్వారా సౌరవిద్యుత్తు తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందుకోసం జిల్లాలో 8 కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ పనులను వరంగల్‌కు చెందిన ఓ గుత్తేదారు సంస్థకు అప్పగించారు. వారు త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇళ్లపై సౌర యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది.

కోటాను మించి సరఫరా..

జిల్లాలో అన్ని రకాల విద్యుత్తు కనెక్షన్లు సుమారు 4 లక్షలున్నాయి. ఇందులో 1.05 లక్షల వరకు బోరు మోటార్లు, 2.65 లక్షలు గృహావసర కనెక్షన్లు, మిగితావి వాణిజ్య, పరిశ్రమలు, వీధి దీపాలకు సంబంధించినవి ఉన్నాయి. జిల్లాలో విద్యుత్తుకు చాలా డిమాండ్‌ ఉంది. నీటి వనరులు లేక రైతులు ఎక్కువగా బోరు బావులపై ఆధారపడుతున్నారు. ప్రతి నెల కేటాయించిన కోటా కంటే ఎక్కువ విద్యుత్తు వాడకం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఒక్కో ప్లాంటుకు రూ.4.25 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇలా ఏర్పాటు చేసిన యూనిట్‌ ద్వారా స్థలాన్ని బట్టి 1 మెగావాట్‌ లేదా 0.50 మె.వా, 0.75 మె.వాల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు.

గ్రిడ్‌కు విక్రయించేలా..

స్థానిక ఉప కేంద్రాల్లో ఏర్పాటు చేసే సౌర యూనిట్ల నిర్వహణను మహిళా సంఘాలకు ఇవ్వాలని సర్కార్‌ ఆలోచిస్తోంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేసి వ్యవసాయ అవసరాలు తీర్చాలని అధికారులు భావిస్తున్నారు.

త్వరలో పనులు ప్రారంభం

రమేశ్‌బాబు, ఎస్‌ఈ, ఎన్‌పీడీసీఎల్‌, కామారెడ్డి

సౌర యూనిట్లు నెలకొల్పేందుకు అనువుగా ఉన్న ఉపకేంద్రాలు ఎంపిక చేశాం. గుత్తేదారులు రాగానే పనులు ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్ట్‌తో విద్యుత్తు సరఫరా మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని