logo

ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం

పార్టీ అభ్యర్థి గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Updated : 09 May 2024 06:01 IST

పట్టు నిలుపుకొనేందుకు శ్రమిస్తున్న ఎమ్మెల్యేలు

ఈనాడు, కామారెడ్డి: పార్టీ అభ్యర్థి గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు, భారాసకు చెందిన ఇద్దరితో పాటు భాజపాకు చెందిన ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేలా ముందుకెళ్తున్నారు.

ఎవరికివారే ప్రత్యేక వ్యూహాలు

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికలను రెఫరెండంగా ప్రకటించి సొంత నియోజకవర్గాల్లో మెజారిటీ తెప్పించే బాధ్యతలను ఎమ్మెల్యేలపైనే మోపారు. కాంగ్రెస్‌కు చెందిన ఎల్లారెడ్డి, జుక్కల్‌, అందోల్‌, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యేలు అంతా తామై వ్యవహరిస్తున్నారు. గ్రామాల వారీగా పార్టీల బలాబలాలను సమీక్షిస్తూ వ్యూహాలను రచిస్తున్నారు. ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు.
  • అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లను మించి.. పార్టీ అభ్యర్థికి మెజారిటీ సాధించాలని నియోజకవర్గ బాధ్యులకు భాజపా నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో లక్ష ఓట్లు సాధించాలనే లక్ష్యంతో భాజపా ఎమ్మెల్యే కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు రెండింతల మెజారిటీ సాధించాలని ఎమ్మెల్యేలకు నిర్దేశించినట్లు సమాచారం.
  • కామారెడ్డిలో బస్సుయాత్ర చేపట్టిన భారాస అధినేత కేసీఆర్‌ పార్టీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాల్సిన ఆవశ్యకతను బాన్సువాడ, జహీరాబాద్‌ ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. బాన్సువాడ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్‌రెడ్డి భారాస నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టు నిలుపుకొనేందుకు పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆయన కుమారులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జహీరాబాద్‌లో సైతం ఎమ్మెల్యే గ్రామాల వారీగా ప్రచారం చేపడుతున్నారు. మైనార్టీ ఓటర్లను కలుస్తూ భారాస హయాంలో చేసిన మేలును వివరిస్తూ మద్దతు కోసం యత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని