logo

ఏనుగు దంతం స్వాధీనం: ఒకరి అరెస్టు

గంజాం జిల్లా బుగుడా ఠాణా పరిధిలోని సంఖురు గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి దాడి చేసిన దక్షిణ ఘుముసుర అటవీ డివిజన్‌ సిబ్బంది ఓ ఏనుగు దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Updated : 08 Aug 2022 06:59 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా బుగుడా ఠాణా పరిధిలోని సంఖురు గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి దాడి చేసిన దక్షిణ ఘుముసుర అటవీ డివిజన్‌ సిబ్బంది ఓ ఏనుగు దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకర్ని అరెస్టు చేసి శనివారం న్యాయస్థానానికి తరలించారు.
* జరడా ఠాణా పరిధిలో జయంతిపూర్‌లోని శ్రీ దివ్యసింహ విద్యాపీఠంలో శారీరక విద్య శిక్షకుని (పీఈటీ)గా పనిచేస్తున్న దనార్దన సాహు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోణలపై బ్రహ్మపుర విజిలెన్స్‌ డివిజన్‌ అధికారులు ఇటీవల పదమూడు చోట్ల దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఆయా దాడుల్లో సాహు అతడి కుటుంబ సభ్యుల పేరిట మొత్తం రూ.4,83,88,052ల విలువ గల స్థిర, చరాస్తులు గుర్తించిన సంగతి విదితమే. సాహు ఆదాయం, ఖర్చులు మినహాయించగా, ఆయన 234 శాతం (రూ.4,01,27,117) అధిక ఆదాయం కలిగి ఉన్నట్లు లెక్కల్లో తేలిందని బ్రహ్మపుర విజిలెన్స్‌ ఎస్పీ గణేష్‌చంద్ర ప్రధాన్‌ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
* కళ్లికోట ఠాణా పరిధిలోని వివిధ చోట్ల వరుస చోరీ ఘటనలు జరిగాయి. నలుగురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి బంగారు ఆభరణాలు, నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఠాణా ఆవరణలో బాధితులకు వాటిని అందజేసినట్లు ఐఐసీ జగన్నాథ మల్లిక విలేకరులకు తెలిపారు.
* బ్రహ్మపుర శివారున ఓ ఇంజినీరింగు కళాశాల విద్యార్థిపై కొందరు దాడి చేయడంతో అతడి చేయి విరిగింది. కశాశాలలో ర్యాగింగ్‌ జరుగుతోందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ దాడి కళాశాల బయట జరిగిందంటూ సంబంధిత కళాశాల యాజమాన్యం విలేకరులతో పేర్కొన్నట్లు ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.
* గంజాం జిల్లా అస్కా ఠాణా పరిధిలోని నువాగాంలో ఆదివారం ఉదయం ఇంట్లో తండ్రిని దుర్భాషలాడిన కొడుకు నేత్రానంద సేన (23) అతడి పీక నులిమి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో తండ్రి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు అక్కడకు చేరుకుని కాపాడారు. ఈ ఘటనపై బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కొడుకు నేత్రానందను అరెస్టు చేసి ఆదివారం న్యాయస్థానానికి తరలించామని ఠాణా ఐఐసీ ప్రశాంత కుమార్‌ సాహు సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని