logo

ఉద్యమ దీప్తి.. చైతన్య స్ఫూర్తి లక్ష్మణ్‌

స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా 1942 ఆగస్టు 9 నుంచి ప్రారంభమైన ‘భారత్‌ ఛోడో’ ఆందోళనలో వేలాదిమంది ఉత్కళీయులు పాల్గొన్నారు. బాలేశ్వర్‌ జిల్లా లుణియా, ఖయిరాడిలి, ఇరామఠ ప్రాంతాల్లో ఉద్యమం తీవ్రం కాగా ఆంగ్లేయుల దమనకాండలో

Published : 14 Aug 2022 04:53 IST

స్వాతంత్య్ర సమరంలో ఉరికంబమెక్కిన సేనాని

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా 1942 ఆగస్టు 9 నుంచి ప్రారంభమైన ‘భారత్‌ ఛోడో’ ఆందోళనలో వేలాదిమంది ఉత్కళీయులు పాల్గొన్నారు. బాలేశ్వర్‌ జిల్లా లుణియా, ఖయిరాడిలి, ఇరామఠ ప్రాంతాల్లో ఉద్యమం తీవ్రం కాగా ఆంగ్లేయుల దమనకాండలో 42 మంది అమరులయ్యారు. అదే సమయంలో అవిభక్త కొరాపుట్‌ జిల్లాలోని మథిలి, పపడహండి ప్రాంతాల్లో 25 మంది గిరిజన యోధులను బ్రిటిష్‌ సైన్యం కాల్చి చంపింది. బాలేశ్వర్‌, కొరాపుట్‌, అనుగుల్‌, ఢెంకనాల్‌, నయాగఢ్‌, అఠాగఢ్‌ (కటక్‌), నీలగిరి, బాలేశ్వర్‌ ప్రాంతాల్లో త్యాగధనులు విజయమో, వీర స్వర్గమో తేల్చుకోవడానికి పోరు ముమ్మరం చేశారు. ఈ సమయంలో బ్రిటీష్‌ పాలకులు పలువురిని బందీలుగా పట్టుకున్నారు.

షహీద్‌ లక్ష్మణ్‌నాయక్‌

దేశభక్తికి మరోపేరు

ఈ సమయంలో అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో సమర శంఖం పూరించిన గిరిజన వీరుడు తోటి ఆదివాసీ యువకుల్లో స్వాతంత్య్రేచ్ఛ, దేశభక్తి నూరిపోశారు. ఆయనే షహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌. 1899 నవంబరు 22న అవిభక్త కొరాపుట్‌ జిల్లా తెంతులిగుమ్మ గ్రామంలో జన్మించిన నాయక్‌ బాల్యం నుంచే నరనరాల్లో దేశభక్తిని జీర్ణించుకున్నారు. ఆంగ్లేయుల దుష్ట పాలన, బానిసత్వ నిర్మూలన ధ్యేయంగా దండకారణ్యం స్థావరంగా చేసుకుని గిరిపుత్రులందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. భారత్‌ ఛోడో ఆందోళనకు నాయకత్వం వహించారు. అల్లూరి సీతారామరాజు, నీలకంఠ పాత్ర్‌, ఇతూరి దొర తదితర విప్లవ వీరులను ఆదర్శంగా తీసుకున్న పోరు తీవ్రం చేశారు. అరెస్టయి 5 నెలలు కారాగారంలో ఉన్నారు. విడుదలైన తర్వాత మల్కాన్‌గిరి ఠాణాపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని వ్యూహం రచించారు. వందలాది మందితో పాదయాత్రగా బయలుదేరిన క్రాంతి వీరులను మథిలి వద్ద బ్రిటిష్‌ అధికారులు అడ్డుకున్నారు. పట్టువీడని వారంతా జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల లాఠీ దెబ్బలను భరించారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో హింగా భుమియా వీర మరణం పొందారు. ఈ సంఘటన నేపథ్యంలో తలోవైపు పరుగులు తీస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌ మరణించాడు. ఆయనను కాల్చి చంపారనే ఆరోపణలతో లక్ష్మణ్‌ నాయక్‌ను బంధించారు.

​​​​​​​

షహీద్‌ నాయక్‌ పేరిట విడుదలైన తపాలా బిళ్ల​​​​​​​

బ్రహ్మపుర జైలులో ఉరి

1943 మార్చి 29న బ్రహ్మపుర మండల కారాగారంలో నాయక్‌ను ఉరి తీశారు. తుదిశ్వాస విడిచే వరకు భారత మాతకు జై అన్న నినాదం వీడని ఈ గిరిజన వీరుడు చరిత్ర పుటల్లో అమరజీవిగా నిలిచారు. భరతమాత దాస్య శృంఖలాలు చేధించడానికి అమరులైన వారిలో ప్రముఖునిగా నేటికీ పూజలందుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని