logo

శరన్నవరాత్రులకు సర్వం సిద్ధం

పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి మరో రెండు రోజులే గడువు ఉండటంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు తూర్పు, పడమర గోపురాలకు రంగులు వేశారు.

Published : 25 Sep 2022 03:10 IST

సాంస్కృతిక వేదిక మార్పు  
సంబరాలకు ప్రత్యేక మార్గం
పాలకొండ, పాలకొండ గ్రామీణ, న్యూస్‌టుడే


రంగులు వేసి ముస్తాబు చేస్తున్న ఆలయం

పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి మరో రెండు రోజులే గడువు ఉండటంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన ఆలయంతో పాటు తూర్పు, పడమర గోపురాలకు రంగులు వేశారు. భక్తులు దర్శించుకునేలా బారికేడ్లు, నీడ కల్పించేందుకు షామియానా వేశారు. క్యూలైన్ల వద్ద అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటివరకు ఆలయం ముందు భాగంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రధాన రహదారి పక్కనున్న వేదికను మార్చాలని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశించడంతో ఆలయ ఆవరణలో ఉన్న కల్యాణ మండపానికి సమీపంలో వేదిక ఏర్పాటుకు నిర్ణయించారు. పట్టణంలో పలు వీధుల నుంచి అమ్మవారి సన్నిధికి వచ్చే సామూహిక సంబరాలను బజారు రహదారి నుంచి ఆలయ ప్రాంగణంలోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. నిత్యాన్నదానాన్ని కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. దీని వెనుక భాగం వాహనాల పార్కింగ్‌కు వినియోగిస్తారు. వీరఘట్టం నుంచి వచ్చే వాహనాలను కార్గిల్‌ కూడలి వద్ద నిలిపేస్తారు. వాటికి అదే రహదారిలో పార్కింగ్‌ స్థలాన్ని కేటాయించనున్నారు.

దర్శనాలకు ప్రత్యేక మార్గాలు
ఆలయానికి వచ్చే భక్తుల దర్శనాలకు ఇబ్బందులు లేకుండా మూడు వరుసల్లో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాధారణ దర్శనాలకు ఒక మార్గం, రూ.25 దర్శనాలకు మరొకటి, సామూహిక సంబరాలతో నేరుగా ఆలయంలోకి వెళ్లేలా మరో క్యూలైను ఏర్పాటు చేశారు. వీఐపీలు దక్షిణ ప్రధాన ద్వారం గుండా వచ్చి దర్శనం చేసుకునేలా నిర్వాహకులు చూస్తున్నారు.


దర్శనాలకు వీలుగా క్యూలైన్లు

రూ.24 లక్షల మంజూరు
శరన్నవరాత్రి ఉత్సవాలకు దేవదాయ శాఖ రూ.24 లక్షలు మంజూరు చేసింది. వీటితో పాటు దాతలు అందించిన విరాళాలు, కానుకలను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లు ఉత్సవాలు సాధారణంగా జరిపారు. ఈ ఏడాది మాత్రం వైభవంగా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.


ఏర్పాట్లపై అసంతృప్తి


దేవదాయ శాఖ సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్పీ

పాలకొండ, న్యూస్‌టుడే: కోటదుర్గమ్మ దసరా ఉత్సవ ఏర్పాట్లపై డీఎస్పీ ఎం.శ్రావణి అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందితో కలిసి ఆమె శుక్రవారం ఆలయాన్ని పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాల వేదిక మార్పుపై తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణ మండపానికి సమీపంలో వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. సామూహిక సంబరాలు బజారు రహదారి నుంచి ఆలయం లోపలికి వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. ఆమె వెంట సీఐ మురళీధర్‌రావు, ఎస్‌ఐ ప్రసాద్‌ సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని