logo

చెట్లు కూలి... రాకపోకలు స్తంభించి...

కొరాపుట్‌ జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పెనుగాలులకు సుమారు 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Published : 21 Mar 2023 03:16 IST

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

రండాపల్లీలో రహదారిపై విద్యుత్తు తీగలు

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పెనుగాలులకు సుమారు 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. శనివారం మధ్యాహ్నం నుంచి గాలులతో వాన పడడంతో జయపురం, కుంద్ర, కొట్పాడు, బొరిగుమ్మ, బొయిపరిగూడల్లో మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. ఇళ్లలోకి నీరు రావడంతో పలువురి సామగ్రి తడిసిపోయింది. జయపురం సమితిలో దాదాపు 50 చెట్లు కూలిపోగా, 3 చోట్ల 11 కేవీ విద్యుత్తు తీగలు రహదారిపై పడడంతో, ఆ ప్రాంతంలో ప్రయాణించేందుకు ప్రజలు భయపడుతున్నారు. విద్యుత్తు, తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దల్‌ అక్తర్‌ గడ్డి ఇంటికి రూ.3,200, పెంకుటిళ్లకు రూ.5,200, పక్కా ఇంటికి  రూ.1,20,000 నష్ట పరిహారం అందజేస్తున్నట్లు ప్రకటించారు. జయపురం అంబాగూడ ప్రాంతంలో దాదాపు మూడు అడుగుల మేర వర్షం నీరు రహదారిపై నిలిచిపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమితి అధికారులు తెలిపారు.


14 జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు

భువనేశ్వర్‌ జయదేవ్‌ విహార్‌లో కురుస్తున్న వాన

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌, బాలేశ్వర్‌, బొలంగీర్‌, కలహండి, నువాపడ, సోన్‌పూర్‌లో సోమవారం మధ్యాహ్నం వడగళ్ల వాన కురిసినట్లు గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. కటక్‌, రాయగడ, కొంధమాల్‌, నయాగఢ్‌ జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయన్నారు. గడిచిన 24 గంటల్లో సుందర్‌గఢ్‌లో అత్యధికంగా 13 సెం.మీ. వాన కురిసిందన్నారు. మయూర్‌భంజ్‌లో 6, బౌద్ధ్‌లో 4, సురడ (గంజాం)లో 4 సెం.బీ. చొప్పున నమోదైందని, మరికొన్ని కేంద్రాల్లో 2 నుంచి 3 సెం.మీ. లోపు వర్షాలు కురిశాయన్నారు. గంజాం జిల్లాలోనూ సాయంత్రం వర్షం కురిసింది. మంగళవారం భద్రక్‌, బాలేశ్వర్‌, కేంద్రపడ, జాజ్‌పూర్‌, మయూర్‌భంజ్‌, కేంఝర్‌, ఢెంకనాల్‌, నువాపడ, కలహండి, నవరంగపూర్‌, రాయగడ, కొరాపుట్‌, మల్కాన్‌గిరి, కటక్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఒడిశా నుంచి ఛత్తీస్‌గఢ్‌ వరకు వాయుమండలంలో ఆవర్తనం ఏర్పడినందున వర్షాలు కురుస్తున్నాయన్నారు.

బాలేశ్వర్‌ జిల్లా కేంద్రంలో వడగళ్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని