logo

నవీన్‌తో మమతా బెనర్జీ భేటీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం సాయంత్రం ఒడిశా సీఎం నవీన్‌ను ఆయన నివాసంలో కలిశారు.

Published : 24 Mar 2023 01:53 IST

నవీన్‌ మెడలో శాలువా వేస్తున్న మమతా

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం సాయంత్రం ఒడిశా సీఎం నవీన్‌ను ఆయన నివాసంలో కలిశారు. పూరీ నుంచి వచ్చిన ఆమెకు స్వాగతించిన నవీన్‌ జగన్నాథుని ఫొటో తీర్థ ప్రసాదాలతో పాటు ‘ఛెన్నాపుడొ’ (జున్ను మిఠాయి) బహూకరించారు. కొద్దిసేపు ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడుతూ..తమ ఇద్దరి మధ్య రాజకీయ అంశాలపై చర్చ జరగలేదని, ఆమె పూరీ దర్శనానికి వచ్చి తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. దేశంలో ఫెడరల్‌ వ్యవస్థ బలంగా ఉండాలన్నదే ఇద్దరి అభిమతమన్నారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. పూరీలోని సిపా సొరుబలి ప్రాంతంలో ఒడిశా ప్రభుత్వం రెండెకరాల స్థలం ఉచితంగా కేటాయించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. పూరీలో బెంగాల్‌ అతిథి భవనం నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం ఉందని, దీనిపై తాము చర్చ జరపలేదన్నారు. దివంగత బిజుబాబు కుటుంబంతో తమకు అనుబంధం ఉందని, పూరీ జగన్నాథుని సన్నిధికి వచ్చినప్పుడు నవీన్‌తో భేటీ అవుతుంటానని చెప్పారు. ఒడిశాకు తుఫాను వస్తే విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రభావం బెంగాల్‌పై పడుతోందన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య సన్నిహిత బంధం ఉండాలని బెంగాల్‌ వాసులంతా జగన్నాథుని భక్తులని పేర్కొన్నారు. ఒడిశా సరిహద్దులోని దిఘాలో తమ ప్రభుత్వం జగన్నాథుని ఆలయం నిర్మించిందని, దీన్ని తిలకించడానికి రావాలని నవీన్‌కు ఆహ్వానించామన్నారు. ఒడిశాలో ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్నందున నిర్మాణాలు పుంజుకోనుండగా, బెంగాల్‌ వరకు పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు మంచి అవకాశాలున్నాయని ఈ అంశంపై నవీన్‌ సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒడిశా సీఎం గొప్ప నాయకుడని ఆమె కొనియాడారు. పూరీలో విడిది చేసిన తనకు అధికారులు సౌకర్యాలు కల్పించారని, నవీన్‌ ఆతిథ్యం మరవలేనని మమతా చిరునవ్వుతో చెప్పారు. ఈ భేటీలో 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని