logo

ప్రధాన పార్టీలకు అసంతృప్తుల బెడద

కొరాపుట్‌ జిల్లా లక్ష్మీపూర్‌, పొట్టంగి, కొరాపుట్‌ నియోజకవర్గాల్లో టికెట్‌ దక్కని అసంతృప్త వర్గాలతో ప్రధాన పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది.

Published : 18 Apr 2024 05:26 IST

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా లక్ష్మీపూర్‌, పొట్టంగి, కొరాపుట్‌ నియోజకవర్గాల్లో టికెట్‌ దక్కని అసంతృప్త వర్గాలతో ప్రధాన పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. దాదాపు అన్ని నియోజక వర్గాల్లో బిజద, భాజపా, కాంగ్రెస్‌ల టికెట్‌ దక్కనివారిలో వ్యతిరేకత ఏర్పడింది.

కొరాపుట్‌ నియోజకవర్గం నుంచి బిజద నుంచి సుమారు 15 మంది టికెట్‌ ఆశించారు. సిటింగ్‌ ఎమ్మెల్యే రఘురామ్‌ పడాల్‌కు అవకాశం లభించింది. ఇది ఇష్టం లేని పలువురు నాయకులు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. అభ్యర్థిని మార్చాలని ఒత్తిడి చేశారు. కొరాపుట్‌, లమతాపుట్‌ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. భాజపా టికెట్‌ రఘురామ్‌ మచ్చోకు రావడంతో మిగతా అభ్యర్థులు ఆందోళన చేయడంతో ఉత్కంఠ నెలకొంది. కొందరు పార్టీ వీడి ఇతర పార్టీల్లో చేరారు.

పొట్టంగిలో కాంగ్రెస్‌ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే రామ్‌చంద్ర కడమ్‌కు దక్కడంతో నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. రేస్‌లో ఉన్న మాజీ ఎంపీ జయరామ్‌ పంగి, సాంబ పంగిలు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. వెంటనే అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేశారు. ఇక భాజపాలో కూడా అసంతృప్తి లేకపోలేదు. అభ్యర్థిగా నిలిచిన చైతన్య హంతల్‌ కుల ధ్రువీకరణ పత్రంతో వివాదాన్ని సృష్టించి వ్యతిరేకిస్తున్నారు. చైతన్య టికెట్‌ సైతం రద్దు అయింది. ఆయన స్థానంలో చైతన్య నందివాలికి టికెట్‌ ఇచ్చారు. దీన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. బిజద సిటింగ్‌ ఎమ్మెల్యే ప్రీతమ్‌ పాఢికి బదులు మాజీ ఎమ్మెల్యే ప్రఫుల్ల కుమార్‌ పంగికి టికెట్‌ ఇవ్వడంతో ప్రీతమ్‌ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అధిష్ఠానం బుజ్జగింపుతో నిర్ణయం మార్చుకున్నారు.

లక్ష్మీపూర్‌లో పెరుగుతున్న రాజీనామాలు

లక్ష్మీపూర్‌ నియోజకవర్గంలో టికెట్‌ కేటాయింపు సక్రమంగా లేక అసంతృప్తివర్గం పార్టీ నుంచి రాజీనామాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అధికంగా ఫిరాయింపులు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌లో టికెట్‌ కేటాయింపులో జరిగిన అసంతృప్తి కారణంగా బందుగాం సమితి ఉపాధ్యక్షురాలు గీతాంజలి పిడికాతోపాటు అనేక మంది రాజీనామా చేసి బిజదలో చేరారు. బిజద విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే కైలాష్‌ చంద్ర కూల్‌సేకాకు టికెట్‌ రాకపోవడంతో భాజపాలో చేరారు. కమలం అభ్యర్థి ఖరారు కాకపోవడంతో కైలాష్‌ పేరు ప్రకటిస్తారని ఆశిస్తున్నారు. ఇంకా టికెట్‌ ఇవ్వకముందే భాజపా నేతలు కైలాష్‌ను వ్యతిరేకించడం ప్రారంభించారు.


స్వతంత్రంగా పోటీ చేసే అవకాశాలు

టికెట్‌ లభించని అనేక మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి అవకాశాలు కనిపిస్తున్నాయి. పొట్టంగిలో జయరామ్‌పంగి, సాంబ పంగి, చైతన్య నందివాలి, కొరాపుట్‌, లక్ష్మీపూర్‌లో మరికొందరు పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అధిష్ఠానాలు అసంతృప్తి వర్గాలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో కొందరు అంగీకరిస్తుండగా, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలకు తిరుగుబాట్ల గండం పొంచి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని