logo

జగన్నాథుడా... నీల మాధవుడా!

రాయగడ జిల్లా బిసంకటక్‌ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఆసక్తికరపోరు నెలకొంది. ఇక్కడి నుంచి ఇద్దరు జగన్నాథులు (జగన్నాథ సరక, జగన్నాథ నుండ్రుక), ఓ నీల మాధవుడు (నీలమాధవ్‌ హికాక) బరిలో ఉన్నారు.

Published : 18 Apr 2024 05:33 IST

బిసంకటక్‌లో ఆసక్తికర పోరు
భాజపా అభ్యర్థి ఖరారుతో వీడిన ఉత్కంఠ
రాయగడ పట్టణం, న్యూస్‌టుడే

రాయగడ జిల్లా బిసంకటక్‌ శాసనసభ నియోజకవర్గ స్థానంలో ఆసక్తికరపోరు నెలకొంది. ఇక్కడి నుంచి ఇద్దరు జగన్నాథులు (జగన్నాథ సరక, జగన్నాథ నుండ్రుక), ఓ నీల మాధవుడు (నీలమాధవ్‌ హికాక) బరిలో ఉన్నారు. ఈ స్థానానికి బిజద అభ్యర్థిగా జగన్నాథ సరక, నీలమాధవ్‌ హికాక కాంగ్రెస్‌ అభ్యర్థిగా గతంలోనే ఆయా పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో భాజపా తరఫున మూడో ప్రత్యర్థి ఎవరన్న ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు జగన్నాథ నుండ్రుక పేరును ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం ఖరారు చేయడంతో ఇన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దీంతో ముందు నుంచే ఆసక్తి రేపుతున్న బిసంకటక్‌ స్థానం జగన్నాథుల్లో ఎవరికో ఒకరికి దక్కుతుందా లేదా వీరిద్దరిని కాదని నీలమాధవుడు కైవశం చేసుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. గతంలో 2014, 2019 ఎన్నికల్లో బిజద తరఫున ఇక్కడ నుంచి పోటీచేసి గెలుపొందిన జగన్నాథ సరక ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, న్యాయశాఖల మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టాలనే ఆశతో సరక రెట్టింపు ఉత్సాహంతో ఉండగా, ఆ ఆశలపై నీళ్లుచల్లి పీఠాన్ని తమ సొంతం చేసుకోవాలని ప్రత్యర్థులు గట్టి పట్టుదలతో ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

త్రిముఖ పోటీ తప్పదా..

2019 ఎన్నికల్లో 66 వేలకుపైగా ఓట్లు సాధించి బిసంకటక్‌ స్థానాన్ని కైవశం చేసుకున్న సరకాకు కాంగ్రెస్‌ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. హస్తం నుంచి బరిలోకి దిగిన నీలమాధవ్‌ హికాక 52 వేలకుపైగా ఓట్లు దక్కించుకోగా, శివశంకర్‌ ఉలక (భాజపా) కేవలం 23 వేల కుపైగా ఓట్లతో సరిపెట్టుకున్నారు. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు రావడంతో ఏ అభ్యర్థి అవకాశాన్ని కొట్టిపారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ బిజద హవా కొనసాగుతున్నప్పటికీ రెండు రోజుల కిందట రఘబారి గ్రామంలో ప్రచారం సందర్భంగా మంత్రి సరకకు ఎదురైన చేదు అనుభవం ప్రతికూలాంశంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంత్రి అయ్యాక ఇలా ఎన్నో గ్రామాల సమస్యలను మంత్రి గాలికొదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నీలమాధవ్‌కు గతంతో పోలిస్తే ఈసారి బలం మరింత పుంజుకోవడం కలిసొచ్చే అంశంగా చెప్పుకొంటున్నారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుని క్షేత్రస్థాయిలో ఎలా వినియోగించుకుంటారన్న ప్రశ్నలు తలెత్తుతుండడం ప్రతికూలంగా మారుతోంది. బిజద సీనియర్‌ నేతగా ఇప్పటికే పలు పదవులు దక్కించుకున్న జగన్నాథ నుండ్రుక ఎన్నికల ముందు పార్టీ కండువా మార్చి భాజపా తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గంలో ఆయన అనుచరుల సాయంతో బిజద ఓట్లతో చాలావరకు భాజపా వైపు మరల్చుకునే అవకాశాలను కొట్టిపారేయలేమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు పార్టీ చిహ్నంపై పడే ఓట్లు అదనపు బలం కావచ్చన్న చర్చ సాగుతోంది. కమలదళానికి దిగువ స్థాయిలో ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకత్వం లేకపోవడం కొంత ప్రతికూలమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని