logo

ప్రధాని పర్యటనకు మూడంచెల భద్రత

బ్రహ్మపుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నగర శివారున కొణిసి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి సమీపాన సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Published : 06 May 2024 04:10 IST

మోదీ ఎన్నికల సభకు ఏర్పాట్లు చేస్తున్న స్థలం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నగర శివారున కొణిసి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి సమీపాన సోమవారం ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనకు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు బ్రహ్మపుర ఎస్పీగా బాధ్యతలో ఉన్న డీఐజీ సార్థక్‌ షడంగి చెప్పారు. ఆదివారం ఆయన సభా ప్రాంగణంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని పర్యటన నేపథ్యంలో ముప్పై పటాలాల బలగాలను మోహరిస్తున్నామని, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 150 మందికిపైగా అధికారుల్ని నియమించామని చెప్పారు. హెలీప్యాడ్‌, సభా ప్రాంగణానికి వంద మీటర్ల దూరంలో ఎలాంటి వాహనాలు, పార్కింగ్‌ స్థలాలు ఉండకూడదన్నారు. రంఢ కూడలి నుంచి గొళంత్రా వరకూ వాహనాల పార్కింగుకు స్థలాలు గుర్తించామన్నారు. బ్రహ్మపుర వైపు నుంచి సభకు వచ్చేవారు గొళంత్రా మీదుగా గుర్తించిన స్థలంలో వాహనాలు నిలిపి, అక్కడి నుంచి ప్రాంగణానికి నడిచి రావాలని సూచించారు. ఇచ్ఛాపురం (ఆంధ్ర) వైపు నుంచి సభకు వచ్చే వాహనాలను గొళంత్రా, రంఢ మధ్యలో గుర్తించిన పార్కింగ్‌ స్థలాల్లో ఉంచాలన్నారు. అదనపు ఎస్పీ వీటిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. సభా ప్రాంగణానికి సమీపంలో రైల్వే లైను ఉందని, ప్రధాని పర్యటన సమయంలో ఇచ్ఛాపురం, బ్రహ్మపుర రైల్వే స్టేషన్‌ల అధికారులతో సంప్రదిస్తామని ఆయన పేర్కొన్నారు. అదనపు డీజీ (హెడ్‌క్వార్టర్‌) పర్యవేక్షణలో గట్టి భద్రత ఏర్పాటు చేశామని డీఐజీ షడంగి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని