logo

గుణుపురం... చతుర్ముఖం

రాయగడ జిల్లాలో గుణుపురం నియోజకవర్గం ఎంతో పరిష్టాత్మకం. ఇక్కడ ఇప్పటి వరకూ ఎక్కువసార్లు కాంగ్రెసు అభ్యర్థులే గెలుపొందారు. నియోజకవర్గంలో గమాంగ్‌లే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకే ఇంటి పేరున్నవారు కావడం గమనార్హం. 

Published : 06 May 2024 04:17 IST

గుణుపురం, న్యూస్‌టుడే

రాయగడ జిల్లాలో గుణుపురం నియోజకవర్గం ఎంతో పరిష్టాత్మకం. ఇక్కడ ఇప్పటి వరకూ ఎక్కువసార్లు కాంగ్రెసు అభ్యర్థులే గెలుపొందారు. నియోజకవర్గంలో గమాంగ్‌లే ఎన్నికవుతూ వస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒకే ఇంటి పేరున్నవారు కావడం గమనార్హం. నియోజక వర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా చతుర్ముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.


రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని రఘునాథ్‌

ఈ ఎన్నికల్లో కూడా గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని బిజద అభ్యర్థి రఘునాథ్‌ గమాంగ్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా బిజదలో విభేదాలున్నా పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు నెక్కంటి భాస్కరావు చేతికి వచ్చిన తరువాత కొంతమేర విభేదాలు సమసిపోయాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుధీర్‌దాస్‌ వర్గం మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నా రఘునాథ్‌ గమాంగ్‌ గెలుపు కోసం అంతా కలిసి పని చేస్తున్నారు. రఘునాథ్‌ గమాంగ్‌ కూడా అందరితో కలిసిపోయి ప్రచారం చేస్తున్నారు.


కాంగ్రెసుకు వ్యతిరేకంగా భాస్కర జగరంగా

కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా భాస్కర జగరంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన గుడారి సమితిలో పార్టీ అధ్యక్షునిగా ఉండేవారు. అక్కడ, చంద్రపూర్‌ సమితిలో కూడా పట్టు సాధించారు. కాంగ్రెసు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేశారు. ఫలించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కాంగ్రెసు, బిజద ఓట్లు కూడా ఈయనకు కొంతమేర పోలయ్యే అవకాశం ఉంది.


ఓటు బ్యాంక్‌ పెంచుకొనే దిశగా అనాసిమి సబర

గుణుపురం నియోజకవర్గంలో సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారు. నియోజకవర్గంలో తమ ఓటు బ్యాంక్‌ పెంచుకోవాలని భావిస్తోంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. ఈసారి ఎన్నికలలో యువకుడైన అనాసిమి సబర పోటీ చేస్తున్నారు. ప్రజల సహకారంతో పోటీలో దిగారు. ఆర్ధికంగా వెనుక బడినా ప్రజలను ప్రత్యక్షంగా కలిసి ఓట్లు అడుగుతున్నారు.


మోదీ ఆదర్శాలతోనే భాజపా ముందుకు

భాజపా అభ్యర్థిగా త్రినాథ్‌ గమాంగ్‌ పోటీలో ఉన్నారు. ఆయన 2014 సంవత్సరంలో బిజద అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసి 26 వేల ఓట్లకుపైగా సాధించారు. ఈసారి కూడా బిజద టికెట్‌ కోసం ప్రయత్నాలు చేశారు. అవకాశం లేకపోవడంతో భాజపాలో చేరారు. పార్టీ టి·కెట్‌తో ఎన్నికల రంగంలోకి దిగారు. జిల్లాలో భాజపా గెలుపు కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడు శివ పట్నాయక్‌ త్రినాథ్‌ గెలుపునకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.


అసంతృప్తుల నడుమ కాంగ్రెసు

గుణుపురం విధానసభ నియోజకవర్గంలో కాంగ్రెసు ఆది నుంచి అసంతృప్తుల నడుమ నడుస్తోంది. ఈసారి గుణుపురం స్థానం గురించి కాంగ్రెసులో ఏడుగురు అభ్యర్థులు దరఖాస్తు చేయగా యువకుడైన సత్యజిత్‌ గమాంగ్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చింది. సత్యజిత్‌ తన మద్దతుదారులతో ప్రచారం చేస్తున్నారు. కొరాపుట్ లోక్‌సభ అభ్యర్థి సప్తగిరి ఉలక మద్దతు పూర్తిగా ఉండడంతో ఆయన సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు. బిజదలోని అసంతృప్త నేతలు నేరుగా కాంగ్రెసుకు మద్దతిస్తున్నారు. ఇది పార్టీకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని