logo

అవును... అంతం చేయగలం

రెండు వారాలకు మించి దగ్గు వస్తోందా..? సాయంత్రమైతే జ్వరం వణికిస్తోందా..? కఫంతో రక్తం పడుతోందా..? రోజురోజుకూ బరువు తగ్గుతున్నారా..? ఛాతిలో నొప్పిగా ఉందా..? అయితే ఆలస్యం చేయొద్దు.. ఓ సారి ఆసుపత్రికి వెళ్లి పరీక్షించుకోండని చెబుతున్నారు వైద్యులు.

Updated : 24 Mar 2023 06:22 IST

క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు

సాలూరులో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది

విజయనగరం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

రెండు వారాలకు మించి దగ్గు వస్తోందా..? సాయంత్రమైతే జ్వరం వణికిస్తోందా..? కఫంతో రక్తం పడుతోందా..? రోజురోజుకూ బరువు తగ్గుతున్నారా..? ఛాతిలో నొప్పిగా ఉందా..? అయితే ఆలస్యం చేయొద్దు.. ఓ సారి ఆసుపత్రికి వెళ్లి పరీక్షించుకోండని చెబుతున్నారు వైద్యులు. ఇవన్నీ క్షయ లక్షణాలేనని, అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణపై వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది. ‘అవును.. మనం క్షయను అంతం చేయగలం’ అనే నినాదంతో ఈ ఏడాది క్షయ నిర్మూలన వారోత్సవాలు చేపట్టనున్నారు. నేడు ప్రపంచ క్షయ నిర్మూలన దినం సందర్భంగా కథనం.


వ్యాప్తి ఇలా..

మైకోబాక్టీరియం టుబర్‌క్యులోసిస్‌ అనే సూక్ష్మ క్రిమి ద్వారా ఇది వ్యాపిస్తుంది. గాలి ద్వారా ఊపిరితిత్తులకు చేరి, అక్కడి నుంచి ఇతర శరీర భాగాలకు వెళ్తుంది. ఇదో అంటువ్యాధి. చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా సోకవచ్చు. క్లోమగ్రంథి, థైరాయిడ్‌ గ్రంథి, జుట్టు, గోళ్లకు తప్ప మిగతా భాగాలు దీని బారిన పడే ప్రమాదముంది. మందులు, అత్యాధునిక చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చినా అవగాహన లేమితో చాలామంది ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు.


వీరే అధికం..

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ఇది సులువుగా కబళిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్థులు, డయాలసిస్‌, కిడ్నీ తదితర సమస్యలున్న వారికి సోకుతుంది. ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఎక్కువుగా ఆటో చోదకులు, ఫార్మా కంపెనీలు- గోనె సంచుల తయారీ పరిశ్రమల్లో పనిచేసేవారు, ప్లంబింగ్‌, భవన నిర్మాణ, ఎలక్ట్రికల్‌, సీలింగ్‌ చేసే కార్మికులు బాధితులుగా మారుతున్నారు. మురికివాడల్లో నివసించే వారితో పాటు మద్యం, గుట్కా, గంజాయి అలవాటున్న వారిలో ఎక్కువగా లక్షణాలు కనిపిస్తున్నాయి. బలమైన ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.


అందుబాటులో వైద్యం..

వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత నాలుగు రకాల మందులను(బరువును బట్టి మోతాదు ఉంటుంది) రోగికి సిఫార్సు చేస్తారు. వీటిని 2 నుంచి 3 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. తరువాత మళ్లీ పరీక్షలు చేసి పరిస్థితిని గమనిస్తారు. తీవ్రతను బట్టి 9 నుంచి 11 నెలల వరకు, కొంతమంది రెండు సంవత్సరాల పాటు మందులు వాడాలి. మధ్యలో ఆపేస్తే ముప్పు తప్పదు. మధుమేహం, హెచ్‌ఐవీ ఉన్నవారు, చిన్నపిల్లలకు ప్రత్యేక చికిత్స ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో మైక్రో స్కోప్‌ పరికరాలున్నాయి. వీటి ద్వారా కళ్లె పరీక్ష చేస్తారు. సీహెచ్‌సీల్లో ట్రూనాట్‌ ద్వారా పరీక్షలు అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సీబీనాట్‌ ప్రక్రియ అందుబాటులో ఉంది.


రూ.500 అందుతోందా?

బాధితుల కోసం ప్రభుత్వం ‘నిక్షయ’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోంది. అందులో వివరాల ఆధారంగా అర్హులైన రోగులకు రూ.500 చొప్పున అందిస్తున్నారు. అయితే చాలామంది లబ్ధి పొందడం లేదు. టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో భాగంగా 62 మంది దాతలు 518 మందిని దత్తత తీసుకుని పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని క్షయ నియంత్రణ పర్యవేక్షణాధికారిణి రామేశ్వరి ప్రభు తెలిపారు. వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఇప్పటికే సర్వే ప్రారంభమైందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని